ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుతున్నాయి. గత ఎన్నికల్లో టిడిపి, బిజెపికి మద్దతు పలికిన జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ ఈసారి స్వయంగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నాడు. మరోపక్క ప్రతిపక్ష నేతగా, తెలుగుదేశం వైఫల్యాలను ఎండగట్టడంలో జగన్ దారుణంగా విఫలమవుతూ, చేతికి అందిన అవకాశాలను వదిలేసుకుంటూ స్వయంకృతాపరాధం చేస్తున్నాడు. చంద్రబాబుకు లోకేష్‌ను సీఎంను చేయడంపైనే దృష్టంతా ఉంది.
ఒకప్పటి వాడిని వేడిని చూపించలేకపోతున్నాడు. అవినీతి, అధికార దుర్వినియోగాలు, ఇసు నుంచి అన్ని మాఫియాలు విజృంభిస్తున్నాయి. దేశంలోనే ఏపీ అవినీతిలో పోటీపడుతోంది. పాలనపై, అధికారులపై, ఎమ్మెల్యేలపై చంద్రబాబు పట్టును కోల్పోతున్నాడు. ఇక చంద్రబాబు తర్వాత టిడిపిని లోకేష్ గానీ, బాలయ్య గానీ ఎవ్వరూ నిలబెట్టలేరనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరోపక్క ప్రత్యేకహోదా విషయంలో ఏపీ ప్రజలను మోసగించిన బిజెపి మాత్రం స్పెషల్ ప్యాకేజీతో తమకు తెలంగాణతో పాటు ఏపీలో కూడా మంచి సానుకూల పవనాలు, మోదీ హవా ఇంకా ఉన్నాయనే నమ్ముతోంది.
దీంతో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోకుండా, ఎన్టీఆర్ వారసురాలైన పురంధేశ్వరికి బిజెపి పగ్గాలు అప్పగించాలనే యోచనలో బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధాని మోదీలు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. పురంధేశ్వరిని తెరపైకి తేవడం ద్వారా ఎన్టీఆర్ వారసత్వంపై మరలా చర్చ జరిగేలా చూడాలని బిజెపి అధిష్టానం భావిస్తోంది. ఇక చంద్రబాబు లోకేష్ కోసం పక్కనపెట్టిన జూనియర్ ఎన్టీఆర్‌ను పురందేశ్వరికి తోడుగా తెచ్చి పావులు కదిపితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అనే దిశగా బిజెపి అడుగులు వేస్తోందట.
వీలుంటే వచ్చే ఎన్నికల్లో బాబు వ్యతిరేకత ఉంటే జగన్‌తోనైనా కలిసి వెళ్లాలని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ దిశగానే ఇటీవల బిజెపి ఎమ్మెల్యేలు, నాయకులు, సోమువీర్రాజు వంటి వారు టిడిపిపై బహిరంగంగానే విరుచుకుపడుతున్నారు. మొత్తానికి పురందేశ్వరికి ఎన్టీఆర్ తోడైతే ఏమైనా జరగవచ్చనేది విశ్లేషకుల మాట...!