మన జక్కన్న కంటే బాలీవుడ్‌ని వణుకుపుట్టించిన దక్షిణాది దర్శకుల్లో శంకర్‌ని ప్రముఖంగా చెప్పుకోవాలి. జక్కన్నను కించపరడం కాదు గానీ తాను ఏ చిత్రం తీసినా అందులో ఏదో ఒక సామాజిక అంశాన్ని పొందుపరిచి, కమర్షియాలిటీ జోడించడంలో శంకర్ సిద్దహస్తుడు. ఇక ఆయన సాంకేతిక విలువలతో ఓ ఆట ఆడుకుంటాడు. 20 ఏళ్ల కిందటే తన 'జీన్స్' చిత్రంలోని ఓ పాటలో తన మాయాజాలం చూపించి, సమ్మోహన పరిచాడు.
డబ్బును నీళ్లగా ఖర్చుపెడతాడని, అనుకున్న సమయానికి అవుట్‌పుట్ ఇవ్వలేడనే విమర్శలు ఆయనపై ఉన్న మాట వాస్తవం. ఇక ఎప్పుడో 'శివాజీ' చిత్రంతోనే 100కోట్లను కొల్లగొట్టాడు. ఇక 'రోబో'తో 250కోట్లు, ఫ్లాప్ అయిన 'ఐ' చిత్రంతో కూడా 200కోట్లు రాబట్టడం ఆయనకే సాద్యమైంది. కాగా ప్రస్తుతం శంకర్ పెరిగిన టెక్నాలజీతో చెడుగుడు ఆడుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. జక్కన్న తీసిన 'బాహుబలి'కి చిరంజీవి, మహేష్‌లు, బాలీవుడ్ దిగ్గజాలే కాదు.. రజనీ సైతం జక్కన్నను దేవుడి బిడ్డగా అభివర్ణించాడు.
శంకర్ కూడా రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపించాడు. అయినా బాహుబలి రికార్డులను కొల్ల గొట్టడంపైనే ప్రస్తుతం శంకర్ కన్ను ఉంది. ఇది ఆరోగ్యకరమైన పోటీ. '2.0' షూటింగ్ పూర్తయినా కూడా దీపావళికి విడుదల కావాల్సిన చిత్రాన్ని 2018 జనవరి 25కి వాయిదా వేయడం వెనుక కూడా చాలా కారణాలే ఉన్నాయంటున్నారు. 'బాహుబలి-ది కన్‌క్లూజన్' కు వాడిన సాంకేతికతను చూసి తన చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్, విఎఫ్‌ఎక్స్ పనులలో మార్పులు చేర్పులు చేసే ఉద్దేశ్యంతోనే శంకర్ కాస్త గ్యాప్ తీసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది.
ఇక 'బాహుబలి'కి జక్కన్న, ప్రభాస్, రానా వంటి పెద్దగా బాలీవుడ్‌లో అప్పటిదాకా సత్తా తెలియని వారే ఎక్కువ. కానీ శంకర్, రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌లంటే అందరికీ తెలుసు. మరి 'బాహుబలి-ది కన్‌క్లూజన్'కి పెరిగే ప్రతి కోటి కలెక్షన్ శంకర్‌కు అగ్నిపరీక్షనే పెడుతుంది. 'బాహుబలి'కి తెగే ప్రతి టిక్కెట్ శంకర్ అండ్ టీంకు ఓ పరీక్షే. అయితే ఒక్కటి. 'బాహుబలి-ది కన్‌క్లూజన్' రికార్డులు బద్దలు కొట్టగలితే దమ్ము ఖాన్ త్రయం కంటే శంకర్ అండ్ టీంకే ఎక్కువగా ఉన్నాయి.