కాంగ్రెస్ హయాంలో గవర్నర్‌గా రాష్ట్రానికి వచ్చిన నరసింహన్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్నారు. ఇప్పటికే రెండో దఫా పదవిని కొనసాగిస్తున్న ఆయన పదవీకాలం నేటితో ముగియనుంది. నరసింహన్ పనితీరు పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతృప్తిగానే ఉన్నాడు. కానీ చంద్రబాబు మాత్రం గవర్నర్ తీరు పట్ల వ్యతిరేకతతో ఉన్నాడని సమాచారం. నరసింహన్ హైదరాబాద్‌కే పరిమితం కావడం వల్ల తెలంగాణకు, అక్కడి సీఎంకు అందుబాటులో ఉంటున్నాడని, తమను పట్టించుకోవడం లేదనే భావన బాబులో ఉంది.
స్వతహాగా మాజీ ఐపీఎస్ కావడంతో హైదరబాద్‌తో పాటు ఇతర చోట్ల మతకలహాలు చెలరేగకుండా నరసింహన్ ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేయడంలో సఫలమయ్యారు. మరోపక్క రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఓటుకు నోటు కేసు నుంచి, అనేక విషయాలలో ఆయన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను గొడవలు లేకుండా సమన్వయం చేయగలిగారు. ప్రస్తుతానికి ఆయనకు ఇరు రాష్ట్రాలలో అపరిష్కృతంగా ఉన్న పలు అంశాలపై ఆయనకు బాగా అవగాహన ఉంది.
తమిళనాడుకు చెందిన నరసింహన్ పట్ల ఇప్పటి వరకు కేంద్రంలోని మోదీ సర్కార్ కూడా కాస్త మొగ్గు చూపుతోంది. అయితే గవర్నర్ పదవిని మూడోసారి కొనసాగించడం పెద్దగా ఎప్పుడు జరగలేదని విశ్లేషకులు చెబుతున్నారు. అందునా కాంగ్రెస్ పార్టీ నియమించిన గవర్నర్ కావడంతో ఆయన పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలున్నాయి. గతంలో తమిళనాడుకు గవర్నర్‌గా చేసిన రోశయ్యని కూడా మోదీ సర్కార్ సాగనంపింది. కానీ జులైలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న దృష్ట్యా నరసింహన్ విషయంలో కేంద్రం ఆచితూచి అడుగులు వేసే పరిస్థితి ఉందంటున్నారు..!