మరీ పాతకాలంకి పోకపోయినా నిన్నామొన్నటి వరకు కూడా తెలుగు చిత్రాలలో విప్లవచిత్రాలు సుగంధాలు బాగానే విరజిమ్మాయి. నాడు కుల వివక్షతను వ్యతిరేకంగా 'మాలపిల్ల' అనే చిత్రం వచ్చింది. కానీ నేడు అలాంటి చిత్రాలను, కనీసం ఆ టైటిల్‌ను మనం ఊహించగలమా? మనోభావాల పేరుతో దర్శకుడు ఏమి చెబుతున్నాడో కూడా ఆలోచించకుండా అడ్డుకునే మహానుభావులున్నారు.
ఇక ఆ తర్వాత మాదాల రంగారావు పేరుతో ఓ ఉద్యమ కెరటం తెలుగు చిత్ర సీమను ఏలింది. ఎందరో దర్శకులతో ఆయన చేసిన చిత్రాలు ఆబాలగోపాలాన్ని అలరించాయి. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పుకోవలసింది స్వర్గీయ ది ఎవర్‌గ్రీన్ టి.కృష్ణ, ఆయన తీసిన 'నేటిభారతం, దేశంలో దొంగలుపడ్డారు. దేవాలయం, ప్రతిఘటన... ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన సృజించని సామాజిక అంశమే లేదు. కానీ ఆయన అతి చిన్న వయసులోనే మరణించడంతో తెలుగు చిత్ర పరిశ్రమ సగం మూగవోయింది.
ఆయన తనయుడు ప్రేమ్‌చంద్ దుర్మరణం చెందడం, గోపీచంద్ కమర్షియల్ హీరోగా నిలుదొక్కుకున్నారు. ఆ తర్వాత మాదాల రంగారావు తనయుడు మాదాల రవి ఒకటి రెండు చిత్రాలు చేసినా నిలదొక్కుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చాడు విప్లవమూర్తి ఆర్.నారాయణమూర్తి. పెద్దపెద్ద బడా నిర్మాతలే వరుసగా రెండు మూడు ఫ్లాప్‌లు ఇస్తే తట్టా బుట్టా తట్టుకునే రోజుల్లో 'అర్దరాత్రి స్వతంతత్య్రం నుంచి తన విజయబావుటాను ఎగురవేస్తూనే ఉన్నాడు. ఆయన తీసిన 'ఎర్రసైన్యం' తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఓపేజీని దక్కించుకుంది.
ఇక మోహనగాంధీ, ముత్యాల సుబ్బయ్య వంటి దర్శకులు, దాసరి కూడా ఆ తరహాచిత్రాలకు ప్రాచుర్యం తెచ్చారు. ఇక టి.కృష్ణమెమోరియల్ బేనర్, నిర్మాతలు పోకూరి బాబూరావులను కూడా గుర్తు చేసుకోవాలి. వందేమాతం శ్రీనివాస్‌లు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇక రచయితగా తనదైన కలం సత్తాను చూపిన ఎంవిఎస్ హరనాధరావు అస్త్రసన్యాసం చేసినట్లే కనిపిస్తున్నారు. మరి ఆర్.నారాయణమూర్తికి వారసుడు ఎవరో?