బాహుబలి ద కంక్లూజన్ చిత్రం గత శుక్రవారం విడుదలై ప్రభంజనం సృష్టిస్తోంది. బాహుబలి కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ బాలీవుడ్ కి వణుకుపుట్టిస్తుంది. ఏకఛత్రాధిపత్యంగా బాక్సాఫీస్ ని దున్నేస్తూన్న బాహుబలి గురించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పారు. అదేమిటంటే... బాహుబలి లో ఒక సన్నివేశాన్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పూర్తితో రాశారంట.
అసలు పవన్ కి బాహుబలికి ఉన్న సంబంధం గురించి ఆయన మాటల్లో.... బాహుబలి ఇంటర్వెల్ సీన్ ఎలా ఉండాలీ? అన్న విషయాన్నీ చాలా రకాలుగా ఆలోచించాం. భళ్లాల దేవుడికి పట్టాభిషేకం జరిగేటప్పుడు భళ్లాల దేవుడు అస్సలు తృప్తిగా ఉండలేదు. మరోపక్క బాహుబలికి అశేష జనవాహిని పడుతున్న నీరాజనాలు చూసి అసూయ ద్వేషాలతో రగిలిపోతుంటాడు. ఇది మేం రాసుకున్న స్క్రిప్ట్. కానీ దాన్ని ఎలా ప్రెజెంట్ చెయ్యాలి అని తర్జన భర్జనలు పడుతున్న సమయంలో అనుకోకుండా టీవీ ఆన్ చెయ్యగా..... అందులో పవన్ కళ్యాణ్ ది ఏదో ఆడియో జరుగుతుంది. ఇంకా అక్కడికి పవన్ రాలేదు. కానీ పవన్ పేరు ఉత్సరించినప్పుడల్లా జనం వెర్రిగా ఊగిపోతూ పవన్.. పవన్ అని అరుస్తూ వేదికపై ఎవ్వరు మాట్లాడినా వినపడకుండా అరుస్తూనే ఉన్నారు. అలాంటి సమయంలో ఆ వేదికపై ఉన్న వారు పవన్ కున్న క్రేజ్ చూసి అసూయ పడాల్సిందే. వెంటనే మేము ఇదేదో బాగుందే అని అనుకున్నాం. వెంటనే బాహుబలి సర్వసైన్యాధ్యక్షుడిగా ప్రమాణం చేస్తున్నప్పుడు ప్రజలంతా బాహుబలి అని అరుస్తూ వాయిద్యాలు మోగిస్తూ హడావిడి చేయడాన్ని విశ్రాంతి ఘట్టంగా రాసేశామని... ఆ విధంగా పవన్ కళ్యాణ్ మాకు స్ఫూర్తినిచ్చాడని.... ఆ క్రెడిట్ మొత్తం పవన్ కిచ్చేశాడు విజయేంద్ర ప్రసాద్.
నిజంగానే బాహుబలి చిత్రంలో ఆ సీన్ చాలా పెద్ద హైలెట్. బాహుబలి రాజమాత సాక్షిగా... అన్నప్పుడు జనాలు పూనకం వచ్చినట్టు ఊగిపోయి భళ్లాల దేవుడికి పిచ్చెక్కిచ్చేస్తారు. ఆ సీన్ బాహుబలికే హైలెట్గా నిలిచింది.