మొన్నటివరకు బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే సస్పెన్స్ తో కొట్టుమిట్టాడిన ప్రేక్షకులు ఆ ప్రశ్నకు శుక్రవారం బాహుబలి ద కంక్లూజన్ విడుదలతో సమాధానం దొరిసేసింది. అయితే ఇప్పుడు మళ్ళీ బాహుబలి వసూళ్ల గురించి హాట్ హాట్ చర్చ మొదలైంది సినీప్రియుల్లో. ప్రపంచం మొత్తం మీద 8000 వేలకు పై మాటే థియేటర్స్లో విడుదలైన బాహుబలి చిత్రం బాక్సాఫీస్ బొనంజాగా నిలిచింది. మరే చిత్రము సాధించని కళ్ళు చెదిరే కలెక్షన్స్ సాధించి ఇండియన్ సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడే చిత్రంగా బాహుబలి నిలుస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఇటు రెండు తెలు రాష్ట్రాల్లో బాహుబలి దుమ్ముదులిపే కలెక్షన్స్ రాబట్టి విమర్శకుల ముక్కుమీద వేలు వేసుకునేలా చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మొదటి రోజే 42 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం అందుతుంది. ఇక ఇతర భాషలు తమిళ్, మలయాళం, కన్నడలలో కూడా బాహుబలి అసాధారణ రికార్డులు నెలకొల్పింది అంటున్నారు. ఇక బాలీవుడ్ లో ఎప్పుడూ ఖాన్స్ త్రయమే బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతూ గొప్పగా చెప్పుకునే అక్కడ కూడా బాహుబలి ద కంక్లూజన్ చిత్రం ఒక డబ్బింగ్ చిత్రంగా విడుదలై బాలీవుడ్ ఖాన్స్ త్రయానికి ముచ్చెమటలు పట్టించే రేంజ్ లో కలెక్షన్స్ వర్షం కురిపించింది. అక్కడ బాహుబలి ఒక్క రోజు కలెక్షన్స్ 40 కోట్లకు పైమాటగా చెబుతున్నారు.
ఇక ఓవర్సీస్ మిగతా దేశాల్లో బాహుబలి సునామీలా విరుచుకుపడింది అంటున్నారు. బాహుబలి శుక్రవారం ఒక్కరోజే 120 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలు క్రిటిక్స్ బాహుబలి మొదటి రోజు వసూళ్లు 80 కోట్ల నుండి 100 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా వేశారు. వారి అంచనాలు తల్లకిందులు చేస్తూ బాహుబలి ఒక్కరోజు కలెక్షన్స్ 120 కోట్లకు పై చిలుకుగా చెబుతున్నారు. ఇప్పట్లో బాహుబలి రికార్డ్స్ ని బద్దలు కొట్టడం ఎవ్వరి వల్ల కాదని అంటున్నారు.