రాజమౌళి.. తీసిన 'బాహుబలి' చిత్రం అద్భుతమే కావచ్చు. కానీ కొందరు మితిమీరి మరీ ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని, ఇండియన్ సినిమా స్టామినాను చెప్పిందని పొగడటం బాధాకరం. భారతీయ చిత్రాలకంటూ ఇంతకాలం ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ముఖ్యంగా విదేశాలలో, పలు చలన చిత్రోత్సవాల్లో బాపు, కె.విశ్వనాథ్, దాసరి, బాలచందర్, శ్యాంబెనేగల్, మృణాల్‌సేన్ మరీ ముఖ్యంగా సత్యజిత్‌రే వంటి వారు భారతీయ చిత్రాలు ఎంత హృద్యంగా ఉంటాయో చాటారు. అతితక్కువ బడ్జెట్‌తో తమదైన దృక్కోణంలో, వాస్తవికతలను ప్రతిబింబించేలా.. వారు తమ చిత్రాలను పలు గ్రాఫిక్స్‌తో, లక్షల కోట్లతో తీసిన చిత్రాల ముందు పోటీకి పెట్టి వావ్... అనిపించిన మనదైన ప్రత్యేకతను చాటారు.
కానీ రాను రాను ఇలాంటి చిత్రాలు తీసే వారు కనుమరుగవుతున్నారు. కోట్లు ఖర్చుపెట్టి, విదేశీ నిపుణులతో పని చేయించుకునే భావ దారిద్య్రం మనకు వచ్చి పడింది. ఎంత ఖర్చు ఎక్కువ పెడితే అంత గొప్ప చిత్రమని, ఎన్ని ఎక్కువ కోట్లు వసూలు చేస్తే అంతగొప్ప చిత్రమనే భావన వచ్చింది. బాలచందర్‌గారు 'ఆకలిరాజ్యం'లో చెప్పించినట్లు మన దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అనేది వాస్తవం, మన కీర్తి కరిగిపోతున్న మంచు కొండ. మన గత కీర్తి చెరిగిపోతోంది. మనది అన్నపూర్ణ, మన అన్న దాన కర్ణ.. అని గొప్పలు చెప్పుకునే స్థాయికి దిగజారుతున్నాం.
మరి రాబోయే రోజుల్లోనైనా రాజమౌళి వంటి విజన్ ఉన్న వ్యక్తి నుంచి మంచి ఆణిముత్యాలు వస్తాయని ఆశించవచ్చా...! లేక ఆయన ఓ ఇంటర్వ్యూలో ఓ విలేకరి 'సై' చిత్రంలో 'రగ్బీ'నే ఎందుకు బ్యాక్ డ్రాప్‌గా తీసుకున్నారు? అని అడిగితే సహనం కోల్పోయి.. అందులో హింస చూపించడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టే ఆ ఆటను బ్యాక్‌డ్రాప్‌గా తీసుకున్నానని చెప్పే భావ దారిద్య్రంలోనే ఆయన మిగిలిపోతాడా? వెయిట్ అండ్ సీ....!