రాజమౌళి బాహుబలి చిత్రాన్ని గత ఐదేళ్లుగా చెక్కి దానికి ప్రాణం పోసాడు. ఆ చిత్రం శుక్రవారం విడుదలై ప్రభంజనం సృష్టిస్తుంది. విమర్శకులు సైతం బాహుబలి చిత్రానికి బ్రహ్మరధం పడుతున్నారు. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రాన్ని అన్నేళ్లు తెరకెక్కించడానికి రాజమౌళి ఫ్యామిలీ పడిన కష్టం అంతా ఇంతా కాదు. అందుకే ఫైనల్ అవుట్ ఫుట్ అంతలా ఇవ్వగలిగారు. ఇక సినిమా ఒకపక్కన బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంటే ఆ చిత్రానికి పేరు పెట్టేవాళ్లే వుండరనుకున్నారు అంతా.
కానీ బాహుబలి విషయంలో కొంతమంది కొన్ని ప్రశ్నలు ఎత్తి చూపిస్తున్నారు. ఈ ప్రశ్నలకు రాజమౌళి ఎప్పటికైనా సమాధానం చెప్పాలని అంటున్నారు. బాహుబలిని చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడూ సినిమా బావుంది అంటూనే... మదిలో మెదిలే ప్రశ్నలు కొన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి ఒక్కొక్కటిగా ఇలా వున్నాయి.
1. మొదటిగా భల్లాల దేవుని భార్యగా లావణ్య త్రిపాఠి నటిస్తుందని బాగా ప్రచారం జరిగింది. కానీ మొదటి పార్ట్ లో రెండో పోర్టులో కూడా రానా కి భార్యగా ఎవరిని చూపించలేదు. అలాగే భల్లాల దేవుడి కొడుకు భద్ర( అడవి శేష్) ఎవరికీ పుట్టాడనేది కూడా క్లారిటీ లేదు.
2. రెండవది రాజమాత శివగామిని భల్లాల దేవుడు బాణంతో కొట్టగా ఆమె నీటిలో బిడ్డ (మహేంద్ర బాహుబలి)తో సహా మునిగిపోయి చనిపోయిందని భావించేటట్టు చేశారు. అయితే మొదటి పార్టులో శివగామి వెంట కొంతమంది సైనికులు పడగా ఆమె బిడ్డతో సహా తప్పించుకుని సొరంగమార్గం ద్వారా బయటపడి నదిలో కొట్టుకుపోతూ బిడ్డని కాపాడుతుంది. మరి పార్ట్ 2 లో మాత్రం రాజమాతని చంపేసినట్టు చూపించేసారు.
3. బాహుబలి బిగినింగ్ లో కనబడిన అస్లాం ఖాన్ పాత్ర సుదీప్ మాత్రం రెండో పార్ట్ లో అస్సలు ఎక్కడా కనబడలేదు. రెండో పార్టులో కట్టప్ప, శివుడు భల్లాల దేవుడిపై ప్రతీకారం తీర్చుకునే సందర్భంలో భల్లాల దేవుణ్ణి ఎదిరించాలంటే మనదగ్గర తగినన్ని ఆయుధాలులేవని చెప్పినప్పుడు అస్లాం ఖాన్ సహాయం తీసుకుంటే బావుండేది. అలా అయితే అస్లాం ఖాన్ కి కూడా పార్ట్ 2 లో కాస్త ఇంపార్టెన్స్ ఉండేది.
4. ఇక ముఖ్యం గా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే మొదటి పార్ట్ లో శివుడుగా కనిపించే ప్రభాస్ కి యుద్ధ విద్యలు గురించి ఎలా తెలుసో క్లారిటీ లేదు. కానీ పార్ట్ 2 లో మాత్రం భల్లాల దేవుడు అనే పెద్ద కొండని తన తండ్రి బాహుబలిలాగే ఎదిరిస్తాడు. అదంతా లాజిక్ గా అనిపించలేదు.
5. ఇక బాహుబలిని కట్టప్ప చంపబోయేటప్పుడు బాహుబలి కట్టప్పని సేవ్ చేద్దామని వచ్చి అసలెవరో తెలియని వారితో యుద్ధం చేస్తాడు. అసలు వారెవరు, ఆ సమయం లో ఎందుకు వచ్చారు.. అనేదానికి క్లారిటీ లేదు.
6. కుంతల రాజ్యం మీదకి బందిపోట్లు వస్తున్నారని వాసన తో కనిపెట్టిన బాహుబలికి.. తన కుటుంబంలో పెదనాన్న, అన్నలు చేసే కుట్రలు తెలియలేదా!
7. అసలు ఈ బాహుబలి అనే ఎపిక్ కి భల్లాల దేవుడు బయటికి కనిపించే విలన్ . కానీ బయటికి కనబడకుండా కుట్రలు చేసే భారీ విలన్ మాత్రం బిజ్జల దేవుడు. మరి చివరి యుద్ధంలో కేవలం భల్లాల దేవుణ్ణి చంపేసి ఆ టైం లో కూడా కట్టప్పతో బేరసారాలు చేసే అంత పెద్ద విలన్ అయిన బిజ్జల దేవుణ్ణి వదిలెయ్యడం ఎంతవరకు కరెక్ట్.
8. బాహుబలి చనిపోయిన తర్వాత ఇదంతా కుట్ర అని శివగామికి చెప్పే కట్టప్ప, సినిమా స్టార్టింగ్ లో శివగామిని చంపాలని భల్లాల, బిజ్జల దేవుళ్ళు చేసే ప్లాన్ ని శివగామికి గాని, బాహుబలి కి గాని ఎందుకు చెప్పలేదు.
ఈ ప్రశ్నలకు అంతగా ఇంపార్టెన్స్ లేకపోయినా సగటు ప్రేక్షకుడు మదిలో మాత్రం ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలానే మెదులుతున్నాయి. మరి సినిమా నిడివి ఎక్కువవుతుందని భావించి ఇవన్నీ కలపకుండా వున్నాడా లేకపోతె నిజంగానే రాజమౌళికి ఈ లాజిక్కులు మెదడుకు చేరలేదా అనేది మాత్రం ఆయన చెబితేనే తెలుస్తుంది.