సినిమా టిక్కెట్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. ఇక పెద్ద చిత్రాల టిక్కెట్లు మెదటి వారం ఎంత అమ్ముడుపోతే అంత గొప్పగా మనవారు ఫీలవుతున్నారు. సామాన్యునికి తక్కువ మొత్తంలో వచ్చే ఎంటర్‌టైన్‌మెంట్‌ని దూరం చేస్తున్నారు. దీంతో సినిమా చూడాలని ఉన్నా కూడా వేలలో ఖర్చుపెట్టలేక బుల్లితెరకి పరిమితమైపోతున్నారు. ఇక నిర్మాతలు అడిగిందే తడవుగా టిక్కెట్ల రేట్లు పెంచడానికే కాదు..... ఏకంగా మొదటి వారం 5 షోలకు పర్మిషన్ అడిగితే, ఆరుషోలకు అనుమతినిచ్చి, 10రోజుల పాటు ప్రజలను లూఠీ చేయమని ప్రభుత్వాలే చెబుతున్నాయి.
ఇక మల్టీప్టెక్స్‌లతో పాటు సింగిల్ థియేటర్లలో మంచి నీటి సదుపాయం ఉండాలనే నిబంధన కేవలం కాగితాలకే పరిమితమవుతోంది. మంచి నీటిని ఉంచరు కదా..! కనీసం వాటర్ బాటిల్‌ను కొనాలంటే మూడు నాలుగింతలు అధిక రేటు చెబుతున్నారు. బయటి నుంచి మంచి నీళ్లను బాటిల్స్ ద్వారా తీసుకుని పోయే నిబంధన ఉన్నా కూడా హ్యాండ్ బ్యాగ్‌లనుంచి సర్వం తనిఖీ చేసి చిన్నపిల్లల కోసం తెచ్చుకున్న మంచి నీళ్లను కూడా ధియేటర్ల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఇదేమని ప్రశ్నించే నాధుడే లేడు.
ప్రభుత్వాలకు ఇవి పట్టవు. తాజాగా ప్రజలందరికీ మంచి నీటిని అందించే ఏర్పాట్లు చేయాల్సిందిగా నిబంధన రావడం ఎంతో కొంత ఉపశమనమే...! అలాగే మంచి నీటి బాటిళ్లను కూడా సినిమా థియేటర్ల యాజమాన్యం అసలు ధరకే ఉంచాలని కూడా ఆదేశాలు వచ్చాయి. ఇక తినుబండారాల విషయంలో కూడా ప్రభుత్వాలు చలించాలి. మనిషికి నీళ్లతోపాటు ఆహారం కూడా ముఖ్యమే కదా...! మరీ దీనిపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి..! ఇక మంచి నీరు ఉచితంగా ఉంచకపోతే ప్రేక్షకులు కూడా ధైర్యంగా ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలి...!