కీరవాణి ఇటీవల మాట్లాడుతూ, గాయనీ గాయకులకు తక్కువ పారితోషికాలు ఇవ్వడంపై స్పందించాడు. ఎవరికి ఎంత ఇవ్వాలి? అనేదానికి కొలమానం అంటూ ఏమీ లేదన్నారు. ఇక ఒక గాయకుకి ఓ అమౌంట్ ఇస్తే.. మరో పాటకు అతను వస్తున్నాడు అంటే ఆ పారితోషికం పట్ల వారు సంతృప్తిగా ఉన్నట్లేనని సూత్రీకరించాడు. ఎవ్వరూ తక్కువకు పాడాల్సిన పనిలేదని, తాను కూడా తన రెమ్యూనరేషన్ నచ్చితేనే సంగీతం అందిస్తానన్నారు. మరోపక్క తనకు ఖరీదైన కార్లు, థియేటర్లు లేవంటున్నాడు. మరి నచ్చిన రెమ్యూనరేషన్‌కే పనిచేస్తే ఆయన ఎందుకు సంపాదించలేకపోయాడు? ఇక గాయనీ గాయకుల పరిస్థితి దారుణంగా ఉంది. పాట పాడినందుకు 2,3వేలు మాత్రమే ఇస్తున్నారు.
మరీ తక్కువ అని అడిగితే కొత్తవారు ఉచితంగా పాడటానికి క్యూలో ఉన్నారని బెదిరిస్తున్నారు. సంగీత దర్శకుల్లో అనేక మంది ప్యాకేజీలు ఒప్పుకుంటున్నారు. తమకు నచ్చిన వారినే ఎంచుకుంటున్నారు. ఇది వాస్తవమే. మరి తమకు రెమ్యూనరేషన్ నచ్చకపోతే పాడవద్దని కీరవాణి గాయకులకు సలహా ఇచ్చారు. మరి అది ఎంత వరకు ఆచరణసాధ్యమో ఆలోచించాలి. ఒక సంగీత దర్శకుడు ఓ గాయకునికి తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత పిలిచినప్పుడు పోకపోతే 'బలుపు' అని పక్కన పెడతాడు. చివరకు వారి జీవనాధారం.. సంగీత ప్రపంచంలో వారి మనుగడే ప్రశ్నార్ధకం అవుతుంది. మరి ఇవ్వన్నీ కీరవాణి వంటి వారు మర్చిపోతే ఎలా...?