ప్రస్తుత సమాజంలో అతి కీలకంగా మారిన వ్యవస్థ మీడియా. ఇది ఏ మహాసముద్రం. దీనిలో లోటుపాట్లు పెద్దగా సామాన్యులకు తెలియవు. దాంతో రాను రాను మీడియా అంటేనే సామాన్యులు బాడ్‌గా చూస్తున్నారు. పైకి మేడిపండులో కనిపించే ఈ వ్యవస్థలోని చేదు వాస్తవాలు తెలిసిన మేధావులు ఎందరో ఉన్నారు. ఇక ప్రస్తుతం పోలీస్, పొలిటిషియన్స్, స్పోర్ట్ పర్సన్స్.. వంటి వారి బయోపిక్‌లు, ఆయా పాత్రలను చూపించే చిత్రాలు చాలా వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో మీడియాపై కూడా చిత్రాలు ఎందుకు రావడం లేదు? అనే అనుమానం వస్తోంది. ఈ పాయింట్‌ని మన మేకర్స్ కమర్షియల్ ఎలిమెంట్‌గా భావించడం లేదేమో అనే విషయంలో డైలమా ఉన్నట్లు అర్ధమవుతోంది. కానీ ఇక్కడ ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో ఏళ్ల కిందట 'న్యూఢిల్లీ టైమ్స్' పేరుతో మలయాళంలో మమ్ముట్టి నటించగా జోషి దర్శకత్వంలో వచ్చిన చిత్రం సంచలన విజయం సాధించింది. ఇక ఆదే చిత్రాన్ని నాటి మాగుంట సుబ్బారామిరెడ్డి జయాపజయాల విషయం ఆలోచించకుండా భారీస్థాయిలో తెలుగులో కృష్ణంరాజు, సుమలత, సురేష్‌గోపి వంటి వారితో 'అంతిమ తీర్పు'గా జోషి దర్శకత్వంలోనే నిర్మాంచారు. తెలుగునాట కూడా ఈ చిత్రం సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత బాలీవుడ్‌లో కూడా రీమేక్ అయింది. ఆమధ్యన 'రంగం' చిత్రం వచ్చి మంచి విజయం సాధించింది. తాజాగా మోహన్‌లాల్ నటించిన 'బ్లాక్‌మనీ' చిత్రం కూడా ప్రశంసలు పొందుతోంది. తెలుగులో మాత్రం ఈ తరహా చిత్రాలు రావడం లేదు. పూరీ-పవన్‌లు 'కెమెరామెన్ గంగతో రాంబాబు' తీసినా కూడా అందులోని లోతుపాతులను చూపించలేదు. మరి తెలుగులో కూడా అలాంటి చిత్రాలు వస్తాయో? లేదో? చూడాలి...!