ఇంతకాలం పవన్‌కళ్యాణ్ జనసేనకు తెలంగాణలో ప్రజాగాయకుడు, యుద్దనౌక, పోరాటాల యోధుడు గద్దర్ నాయకత్వం వహిస్తారనే విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇక ఇటీవల గద్దర్ తాను ఇంతకాలం బూటకపు ఎన్నికలను బహిష్కరించమని చెప్పానని, ఇక ఎన్నికల విధానాలతోనే పోరాటం చేస్తానని చెప్పాడు. దీంతో ప్రమాదాన్ని ముందుగానే గ్రహించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దర్ కదకలికలపై మరింత నిఘా పెంచినట్లు సమాచారం.
తాజాగా గద్దర్ తాను పవన్‌తో పనిచేయడానికి సిద్దమేనని చెప్పడంతో ఈ విషయం ఓ కొలిక్కి వచ్చింది. గద్దర్, జనసేనకు తెలంగాణలో సారధ్యం వహిస్తే అది ఆ పార్టీకి ఎంతో మేలు చేస్తుంది. గద్దర్ తెలియని తెలంగాణ.. సారీ.. తెలుగు ప్రజలు ఉండరు. ఇక ఆయన వల్ల తెలంగాణ, ఏపీలలో వామపక్షాల మద్దతు కూడా జనసేనకు లభించే అవకాశాలు మెరుగయ్యాయి. ఇక గద్దర్ తెలంగాణ ఆవిర్భావం కోసం ఓ పార్టీ ఏర్పడినట్లుగానే, తెలంగాణ పునర్నిర్మాణానికి మరో పార్టీ అవసరమని చెప్పి తన అజెండా ఏమిటో తెలియజేశాడు. త్వరలో ఆయన ప్రొఫెసర్ కోదండరాంతో కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.
మరోపక్క గద్దర్ మాట్లాడుతూ, పవన్ కూడా సౌత్ ఇండియన్ కల్చరల్ అంటున్నారని, దక్షిణాదిలో మలయాళం, కొంకణి వంటివి కూడా ఉన్నాయని ఈ విషయమై తమ్ముడు పవన్‌కి లెటర్ రాశానని సమాధానం కోసం ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యానించాడు. మొత్తానికి ఏపీపై చూపిన శ్రద్ద తెలంగాణపై చూపడంలేదని పవన్‌పై వస్తున్న విమర్శలకు గద్దర్ తెరదించుతాడేమో వేచిచూడాల్సివుంది...!