ఇంతకాలం జనసేనాధిపతి బిజెపినే టార్గెట్ చేస్తూ టిడిపి పట్ల, చంద్రబాబు పట్ల మెతకవైఖరి అనుసరిస్తున్నారనే విమర్శ బాగా ఉండేది. కానీ ఇప్పుడు పవన్ స్వరం పెరిగింది. ప్రత్యేకహోదా ఇస్తామని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు గత ఎన్నికల సమయంలో ఒకే వేదికపై హామీ ఇచ్చినప్పుడు.. అవే సభల్లో పాల్గొన్న జనసేనాని పవన్‌కళ్యాణ్‌కు ఈ విషయంలో వారిని ప్రశ్నించే హక్కును ఎవ్వరూ కాదనలేరు. ఇప్పుడు పవన్ టిడిపిని కూడా టార్గెట్ చేస్తున్నాడు. దీనికి చలసాని శ్రీనివాస్‌తో పాటు హీరో శివాజీ కూడా మద్దతు పలికి బాబును, మోదీని కడిగేశారు.
ప్రత్యేకహోదా అవసరం లేదన్నవారిని తరమికొట్టాలని పిలుపునిచ్చారు. హోదా 5ఏళ్లు సరిపోదు.. ప్రత్యేకప్యాకేజీలు దానికి సరిసమానం కాదు.. అదే సంజీవని అని చెప్పిన బాబును, వెంకయ్యలను నిలదీయాలన్నారు. దక్షిణాదిపై సవతి తల్లి ప్రేమతోపాటు దేశంలో, మరీ ముఖ్యంగా తమకు పట్టులేని దక్షిణాది రాష్ట్రాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను నాశనం చేసి, తమ ఆదిపత్యం కోసం మోదీ, అమిత్‌షాలు వ్యూహరచన చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేనను నాశనం చేసి, తమిళనాడులో, ఒరిస్సాలలో అదే వ్యూహరచన చేస్తోన్న బిజెపి తమకు దక్షిణాదిలో పట్టున్న కర్ణాటక పీఠాన్ని మరోసారి అధిరోహించేందుకు కృష్ణాజలాల విషయంలో తెలుగురాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారన్నారు.
ఇక ప్రత్యేకహోదా ఏ రాష్ట్రానికి ఉండదని చెబుతున్న మోదీ, బిజెపిలు, టిడిపి నాయకులు జీఎస్టీ బిల్లులో ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు ఎందుకు రాయితీలు ఇచ్చారని, ఇవ్వన్నీ తెలిసినా బాబు ఎందుకు మౌనంగా ఉంటున్నాడని నిలదీశారు. జగన్ ప్రశ్నిస్తుంటే హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడటం కాదంటున్నారని, మరి చంద్రబాబు, లోకేష్‌లు కోట్లు ఖర్చుపెట్టి హైదరాబాద్‌లో ప్యాలెస్‌లు ఎలా కట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి చలసాని శ్రీనివాస్, శివాజీల మాటలు అక్షరసత్యాలు...!