ఏప్రిల్‌లోనే భానుడు భగభగలాడుతున్నాడు... ఇప్పటికే రెండు తెలుగురాష్ట్రాలలో కూడా 45 డిగ్రీల ఎండ నమోదవుతూ ఉంది. రాష్ట్రాలు నిప్పుల కొలిమిగా మారుతున్నాయి. అత్యవసరం అయితే తప్ప సామాన్యులు బయటకు రావడం లేదు. కానీ మన హీరోలు మాత్రం తామనుకున్న చిత్రాలను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి నిప్పుల కొలిమి వంటి ఎండల్లో కూడా తమ పని తాము చేసుకుని పోతున్నారు. సరిగా ప్లానింగ్ లేకపోవడం కూడా దీనికి ఒక కారణమేమో అనిపిస్తోంది.
ఇక మురుగదాస్‌తో మహేష్‌బాబు చేస్తున్న ద్విభాషా చిత్రం 'స్పైడర్' చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో మహేష్ సైతం ఎండలను లెక్క చేయకుండా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ఇక ఈచిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత మాత్రం ఈ వేసవి నుంచి తప్పించుకునేందుకు కొరటాల చిత్రాన్ని పదిరోజులు లండన్‌లో పెట్టుకున్నాడు. పవన్ జోరు పెంచాడు. 'కాటమరాయుడు' చిత్రం తీవ్రనిరాశపరచడంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రామోజీఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. పవన్ ఎలాగైనా చిత్రాన్ని ఆగష్టు11న విడుదల చేయాలనే పట్టుదలతో ఎండల్లో 12గంటలకు పైగా కష్టపడుతున్నాడు.
కాకపోతే చిత్రం సెట్‌లో ఏసీలు అమర్చారని అంటున్నారు. ఇక బాలయ్య కొంచెం మేలు. ఈ వయసులో కూడా ఆయన ఎండను లెక్కచేయడం లేదు. పూరీజగన్నాథ్‌తో చేస్తున్న చిత్రం షూటింగ్‌ను హైదరాబాద్‌లోనే పాల్గొంటున్నాడు. అయితే అల్యూమినియం ఫ్యాక్టరీకి చేరువలో వేసిన మార్కెట్ సెట్‌లో పగలు కాకుండా రాత్రిళ్లు షూటింగ్ పూర్తి చేస్తున్నాడట. రామ్‌చరణ్, సుకుమార్‌ల చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ప్రస్తుతం గోదావరి అందాల నడుమ జరుగుతోంది. అక్కడ కూడా ఎండలు మండిపోతున్నాయి. దీంతో షూటింగ్ గ్యాప్‌లో అసిస్టెంట్ చేత గొడుగు పట్టిచుకుంటూ చెమటలు కక్కుతున్నాడు. అఖిల్-విక్రమ్.కె.కుమార్‌ల చిత్రం షూటింగ్ కూడ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ఎండలను సైతం లెక్కచేయకుండా అఖిల్ మెట్రోరైల్‌లో సీన్స్‌ని కసితో చేస్తున్నాడు. మరోవంక నాగార్జున, ఎన్టీఆర్, రవితేజ వంటి హీరోలు కూడా చెమటలు కక్కుతున్నారు.