తెలుగులో ప్రస్తుతం సంగీత దర్శకులంటే ఎక్కువగా దేవిశ్రీప్రసాద్, తమన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇక కీరవాణి సినిమాలు తగ్గించుకుంటున్నాడు. మణిశర్మ మరలా ఇప్పుడిప్పుడే పాత వైభవం కోసం పోరాడుతున్నాడు. అనూప్‌రూబెన్స్‌కి మంచి అవకాశాలు వస్తున్నా.. సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. ఇటీవలే 'కాటమరాయుడు' ప్రస్తుతం అఖిల్-విక్రమ్.కె.కుమార్‌ల కాంబినేషన్‌లో నాగార్జున నిర్మిస్తున్న చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు.
ఇక మహేష్ మురుగదాస్ చిత్రానికి హారీస్‌జైరజ్‌ను తీసుకున్నాడు. త్రివిక్రమ్ 'అ..ఆ'తో దేవిశ్రీని వదిలి ఇప్పుడు పవన్ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్‌ను ఎంచుకున్నాడు. ఇక గోపీసుందర్, మిక్కిజెమేయర్, సునీల్‌కశ్యప్ వంటి వారు స్టాండర్డ్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ వరుస హిట్లను ఇవ్వలేకపోతున్నారు. ఇదే సమయంలో మన స్టార్స్ ఇతర భాషా సంగీత దర్శకులను వెతికే క్రమంలో బాలీవుడ్ వైపు దృష్టిసారిస్తున్నారు. వాస్తవానికి రవితేజకు ఆస్థాన సంగీత దర్శకుడు తమన్. కానీ ప్రస్తుతం విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న 'టచ్ చేసి చూడు'కు బాలీవుడ్ బిజీ సంగీత దర్శకుడు ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. ఏరికోరి నిర్మాతలు నల్లమలుపు బుజ్జి, వల్లభనేనిలు భారీ పారితోషికం ఇచ్చి ముంబై నుంచి ఆయన్ను దిగుమతి చేసుకున్నారు.
'దంగల్, దిల్‌వాలే, యే దిల్‌హై ముష్కిల్, భజరంగీ భాయిజాన్' వంటి చిత్రాలకు సంగీతం అందించిన అతనిపై టాలీవుడ్ కన్నుపడింది. ఇక అల్లుఅర్జున్ అయితే దేవిశ్రీనే కోరుకుంటాడు. కానీ 'డిజె' తర్వాత ఆయన లగడపాటి శ్రీధర్ నిర్మాతగా రచయిత వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తే 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చేయనున్నాడు. ఈ చిత్రానికి గాను బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్‌ని తీసుకున్నారు.
వీరు గతంలో వెంకటేష్ నటించిన 'చింతకాయల రవి'కి మంచి సంగీతాన్నే అందించారు. ఇక ప్రస్తుతం త్వరలో విడుదల కానున్న 'బాహుబలి-ది కన్‌క్లూజన్' తర్వాత ప్రభాస్ సుజీత్‌ల కాంబినేషన్‌లో దాదాపు 150కోట్ల బడ్జెట్‌తో 'సాహో'చిత్రం రూపొందనుంది. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. దీంతో ఈ త్రిభాషా చిత్రానికి బాలీవుడ్ సంగీత త్రయం శంకర్-ఇహసాన్-లాయ్‌లు సంగీతం అందిస్తున్నారు. గతంలో వీరు సిద్దార్థ్ హీరోగా నటించిన 'కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం' చిత్రానికి ఏవరేజ్ సంగీతాన్ని అందించారు.