రాంగోపాల్ వర్మ.. ఈయన ఓ దర్శకుడు కాదు.. ఓ బ్రాండ్ నేమ్. ఒకప్పుడు వర్మ నుంచి చిత్రం వస్తుందంటే ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసేవారు. తోటి దర్శకులు, హీరోలు కూడా ఆయన చిత్రాలను రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవారు. సినిమా ఎలా తీసినా కూడా చూసేందుకు ఆయనకంటే ఓ వర్గం ప్రేక్షకులు ఉండేవారు. దాంతో ఆయన లోబడ్జెట్‌లో సినిమాలు తీసి ఒకే సారి హిందీ, తెలుగుతోపాటు విడుదల చేసి కేవలం ఓపెనింగ్స్‌తోనే తన చిత్రాల బడ్జెట్‌ని తిరిగి సంపాదించే మార్కెటింగ్ స్ట్రాటర్జీ ఆయనది.
కానీ ఆయన నేడు తన పైత్యంతో ఉన్న పేరును చెడ్డగొట్టుకుంటున్నాడు. స్టార్ హీరోలే కాదు.. చిన్న సైజ్ హీరోలు కూడా ఆయనంటే భయపడుతున్నారు. వర్మ పేరును చూసి థియేటర్లకు వచ్చే వారు కూడా లేకుండా పోయారు. అంతా నా ఇష్టం.. అనేట్లు సినిమాలు చుట్టేస్తున్నాడు. బాలీవుడ్‌లో అవకాశాలు లేక ఇక చస్తే తెలుగులో చిత్రాలు చేయనని చెప్పిన ఆయన మరోసారి తెలుగుపై దండయాత్ర సాగించాడు. పనిలో పనిగా తెలుగులో, ఇతర దక్షిణాది భాషల్లో తీసిన చిత్రాలను కూడా ఇతర భాషల్లో రిలీజ్ చేశాడు.
కానీ తెలివిమీరిపోయిన ప్రేక్షకుల ముందు ఆయన పప్పులుడకలేదు. ఒక 'రక్తచరిత్ర1, కిల్లింగ్ వీరప్పన్, వంగవీటి' చిత్రాలు మాత్రమే ఫర్వాలేదనిపించాయి. దాంతో ఇక్కడ లాభం లేదని ముంబైఫ్టైట్ ఎక్కాడు. ఇక వర్మతో చిత్రాలు చేయనని చెప్పిన బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ ని మరలా మేజిక్ చేశాడు. 'సర్కార్, సర్కార్‌రాజ్' చిత్రాలను సాకుగా చూపి 'సర్కార్3' చిత్రానికి ఒప్పించాడు. ఇకేముంది... తన స్టైల్‌లోనే మరోసారి వేగం షూటింగ్ ఫినిష్ చేశాడు. ఇక ఈ చిత్రం ఫస్ట్‌లుక్స్‌తో పాటు టీజర్‌కి ట్రైలర్‌కి కూడా మంచి స్పందనే లభించింది. ఇక ఈ చిత్రాన్ని మే 17న రిలీజ్ చేస్తానని చెప్పాడు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా అనుకున్న సమయానికి చిత్రాన్ని విడుదల చేసే ఆయన ఆ తర్వాత వర్మ తన పుట్టినరోజు కానుకగా ఏప్రిల్7న విడుదల చేస్తున్నానని అనౌన్స్ చేశాడు.
ఆ తర్వాత మరలా ఏప్రిల్14కి వాయిదా వేశాడు. తాజాగా మే 12 అంటూ కొత్త తేదీ ప్రకటించాడు. ఇక వర్మ ట్రాక్‌రికార్డులను చూసి ఈ చిత్రం బిజినెస్ కాలేదా? బిగ్‌బిపైన నమ్మకంతో కూడా 'సర్కార్3'ని ఎవ్వరూ కొనలేదా? లేక మరేమైనా ఇబ్బందులు వచ్చాయా? ఇంతకీ తమ అభిమాన హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియక, ఎందుకు విడుదల కావడం లేదో అర్దం కాక అమితాబ్ ఫ్యాన్స్ గందరగోళంలో పడుతున్నారు. కాగా తాజా నిబంధనలన ప్రకారం ఏ వ్యక్తి సంబంధించిన బయోపిక్ వంటి చిత్రాలకు ఆయా కుటుంబసభ్యుల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికేట్ తేవాలనే నిబంధన పెట్టారు. మరి దీని వల్ల ఈ చిత్రం ఆలస్యమవుతోందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. దీంతో ఆయన తర్వాత వందల కోట్లతో తీస్తానని చెప్పిన 'న్యూక్లియర్, శశికళ' చిత్రాలు కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితీ లేదంటున్నారు...!