రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీ లోటు బడ్జెట్‌లో ఉన్న మాట వాస్తవమే. ఇక తెలంగాణ మిగులు బడ్జెట్‌లో ఉంది. కానీ చంద్రబాబు నేడు కేంద్రంలోని మోదీని చూసి భయపడుతూ, తన నియోజకవర్గాల పునర్విభజన, తనపై ఉన్న కేసులు వంటివి చూసి కేంద్రానికి భయపడుతున్నాడు. ఇక మనది సమైక్య స్ఫూర్తి. కేంద్ర, రాష్రాలు కలిసి పనిచేయాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వంత పాడితేనే ఆయా రాష్ట్రాలు అభివృద్ది చెందుతాయని, కాబట్టి కేంద్రానికి అణిగిమణిగి ఉండాలనేది తప్పు.
తెలుగుదేశంని స్థాపించిన స్వర్గీయ ఎన్టీఆర్ ఆ పార్టీని కేంద్రం ముందు మోకరిల్లకుండా, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టకుండా ఉండాలని భావించాడు. కానీ నేటి టిడిపి, బాబులు కేంద్రానికి వంగి వంగి సలాం చేస్తున్నారు. మరోపక్క ఎన్నో కేంద్రంతో విభేదాలున్న రాష్ట్రాలు కూడా కేంద్రం మెడలు వంచి తామనుకున్నవి చేస్తున్నాయి. ఇక తాజాగా టిఆర్‌ఎస్ అదే వ్యూహం పన్నింది. ముస్లింల రిజర్వేషన్ల కోసం కేంద్రం ముందు మోకరిల్లమని, అవసరమైతే పోరాటం చేస్తామని చెబుతోంది.
దీనివల్ల కేసీఆర్‌కు ఎన్నో లాభాలున్నాయి. రేపు ముస్లిం రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకుంటే, తెలంగాణలో బలపడాలని చూస్తున్న బిజెపికి చెక్ పెట్టి, కీలకమైన ముస్లిం ఓట్లను సాదిస్తాడు. కేంద్రం ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే తానే సమైఖ్య, లౌకిక వాదినని, కేంద్రం మెడలు వంచామని ప్రచారం చేస్తాడు. ఇలా ఆయన ద్విముఖ వ్యూహం అనుసరిస్తూ కేంద్రంతో సయోధ్యగానే ఉండి.. అవసరమైన వేళ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తున్నానని చెప్పి కేంద్రంలోని బిజెపి అంటే తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత తెస్తున్నాడు. కానీ ఈ వ్యూహాలు చాణక్యుడైన బాబుకు చేతకావడం లేదు.