ప్రతి హీరో తమలోని నటుడిని బయటకు తీసి అన్ని వేరియేషన్స్, అన్ని కోణాలను స్పృశించే చిత్రాలను, అన్ని వర్గాలను అలరించే చిత్రాలను చేసి, తెలుగు ఖ్యాతిని నిలబెట్టాలి. మాస్, యాక్షన్ సినిమాలు చేయడం తప్పుకాదు.. దానిలో కూడా ఎన్నో భావాలు, రౌద్ర, బీభత్స రసాలను, కరుణ, ఎమోషన్స్‌ని, రొమాన్స్‌ని కూడా చూపించాలి. అదే సమయంలో కుటుంబ చిత్రాలను కూడా చేసి తమ సత్తా చాటాలి. ప్రయోగాత్మక చిత్రాలను కూడా చేసి టాలీవుడ్ ఖ్యాతిని పెంచాలి.
కానీ కొంతమంది హీరోలు మూసలో పడి ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుని బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. రవితేజ, ఎన్టీఆర్ వంటి హీరోలు కూడా విభిన్న చిత్రాలను ఎంచుకుంటూ ఆశలు రెకెత్తిస్తున్నారు.
ఇక తాజాగా జరిగిన 'శతమానం భవతి' అభినందన వేడుకకు కళ్యాణ్‌రామ్ కూడా హాజరై, తన భార్య కూడా ఎప్పుడు కొట్టుకోవడాలు, చంపుకోవడాలేనా..? ఇలాంటి చిత్రాలు చేయవచ్చు కదా...! అని చెప్పిందని అన్నారు. ఈ మాట అక్షరాలా వాస్తవం. ఇక నాని కూడా 'శతమానం భవతి' చిత్రం గొప్పతనాన్ని, తన అపార్ట్‌మెంట్‌లో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. మరి ఈ మాటలు అందరు హీరోలకు స్ఫూర్తిగా నిలవాలని ఆశిద్దాం...!