మామూలుగా అందరికీ ఎవేవో సెంటిమెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా సినీ నటులకు, ఆటగాళ్లకు ఇవి బాగానే ఉంటాయి. కానీ మహేష్ మాత్రం బ్యాడ్ సెంటిమెంట్‌ను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం మహేష్.. మురుగదాస్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన వెంటనే దానయ్య నిర్మాణంలో మరోసారి 'శ్రీమంతుడు' డైరెక్టర్ కొరటాల శివతో పనిచేస్తున్నాడు. సాధారణంగా మహేష్‌తో ఒకటికి మించి చిత్రాలు చేసిన దర్శకుల్లో పూరీ మినహా ఎవ్వరూ సరిగా క్లిక్ కాలేదు. కానీ కొరటాలకు మరో సినిమా మహేష్ చేస్తుండటం విశేషం. ఇక ఈచిత్రం షూటింగ్‌ను లండన్‌లో జరపనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో కాస్త ఆయన అభిమానుల్లో కూడా కంగారు మొదలైంది.
గతంలో సుకుమర్ దర్శకత్వంలో లండన్‌లో ఎక్కువభాగం షూటింగ్ జరుపుకున్న '1' (నేనొక్కడినే) డిజాస్టర్ అయింది. కాగా '1' చిత్రం కోసం 40రోజులకు పైగా లండన్‌లో షూటింగ్ జరిపారు. కానీ కొరటాలతో చేస్తున్న 'భరత్ అనే నేను' చిత్రం కోసం కేవలం కొన్నిపాటల చిత్రీకరణను ముందుగా జరిపేందుకు ఓ 10రోజులు లండన్‌లో లోకేషన్స్‌కి వెళ్తున్నారట. అంతేగానీ ఈ చిత్రానికి లండన్ బ్యాక్‌డ్రాప్ అవసరం లేదని సమాచారం. ఇండియాలో ఇది వేసవి కాబట్టి లండన్‌లో షూటింగ్‌ను ప్లాన్ చేశారు. ఇక లండన్‌లో షూటింగ్ చేయడం వల్ల ఇంగ్లాండ్ ప్రభుత్వం తమ దేశంలో షూటింగ్ జరిపిన చిత్రాలకు పర్యాటక ప్రాచుర్యం కోసం బాగా సబ్సిడీ ఇస్తుంది. దీంతో మహేష్-కొరటాల-దానయ్యలు సెంటిమెంట్‌ను పక్కనపెట్టి లండన్‌నే ఎంచుకున్నారు.