హీరోలు కళామతల్లి సేవ చేస్తారో లేదో తెలియదు.. గానీ కొన్నిసార్లు మాత్రం వారు తమ ప్రేక్షకులు, అభిమానుల కోసం ప్రాణాలకు తెగించి ఫీట్లు చేస్తుంటారు. కేవలం డబ్బు కోసమే వారు ఇలాంటి రిస్క్‌లు చేయరు. కేవలం ప్రేక్షకుల ఆనందం కోసమే చేస్తారనేది మాత్రం వాస్తవం. ఇక చాలా ఏళ్ల కిందట మెగాస్టార్ చిరంజీవి తన 'బావగారూ బాగున్నారా' చిత్రం కోసం బంగీ జంప్ చేశాడు. వందల అడుగుల ఎత్తు నుంచి ఆయన ఆ ఫీటు చేశాడు. మామూలుగా అయితే డూప్‌లతో పనికానివ్వవచ్చు.
కానీ చిరు తాను ఒరిజినల్‌గా ఆ రిస్క్ చేశాడు. ఆ చిత్రానికి అది పెద్ద ప్లస్ అయింది. ఆతర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ తొలినాళ్లలోనే 'సుబ్బు' చిత్రంలో బంగీ జంప్ చేశాడు. చిత్రం పెద్దగా ఆడకపోయినా ఆయన చేసిన ప్రయత్నాన్ని మాత్రం అందరూ మెచ్చుకున్నారు. ఇక 'ఆరెంజ్' చిత్రం కోసం రామ్‌చరణ్, జెనీలియాతో కలసి కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడ్రైవింగ్ చేసిన ఘనత పొందాడు. ఇక తాజాగా యాక్షన్ హీరో గోపీచంద్ సైతం తాను సంపత్ నందితో చేస్తున్న 'గౌతమ్ నంద' కోసం పూర్తిస్థాయిలో స్కైడ్రైవింగ్ చేశాడు.
ఈ చిత్రం ఇంట్రో సాంగ్‌కు ఈ సన్నివేశం హైలైట్ కానుందిట. ఇక దీనికి రాజుసుందరం కొరియోగ్రఫీ అందించాడు. మొత్తానికి వందల రూపాయలను ఖర్చుచేసి థియేటర్‌కు వచ్చే ఆడియన్స్‌కి డబ్బులకు తగ్గ ట్రీట్ అందించడానికి రెడీ అవుతున్న హీరోలను మాత్రం ప్రశంసించాల్సిందే.