ఇండస్ట్రీ అనేది కేవలం నాలుగైదు కుటుంబాల చేతిలో బందీ అయిపోంది. స్టార్‌డమ్ చుట్టూ, స్టార్స్ చుట్టూ, రెండు మూడు కులాల గుప్పిట్లో నలిగిపోతోంది. ఇదేమిటని ప్రశ్నించిన వారిని తీవ్రంగా దుయ్యబడుతున్నారు. ఎవరు ఎవరినైనా అభిమానించవచ్చు కానీ సీనియర్లకు కనీస విలువ, తోటి కళాకారుడనే గౌరవం ఇవ్వాలి. కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ పెద్దలు కూడా మౌనం పాటిస్తున్నారు. ఇక గతంలో నూతనప్రసాద్, రమాప్రభ, జమున, కైకాల సత్యనారాయణ వంటి వారు తమను అసలు పట్టించుకోవడం లేదని అవేదన వ్యక్తం చేశారు. తాజాగా కోట తన ఆవేదన చెప్పుకొని ఇద్దరు ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన్ను 'మండలాధీశుడు' చేసినప్పుడు తరమి తరమి కొట్టారే గానీ ఓ నటునిగా, కళాకారునిగా చూడలేదు. ఇక తాజాగా కోట మాట్లాడుతూ, 'అత్తారింటికిదారేది' థ్యాంక్స్ మీట్‌లో పవన్ ఆ చిత్రానికి పనిచేసిన అందరి గురించి మాట్లాడుతూ, చివరకు నా గురించి వచ్చేసరికి 'కోటగారు పెద్ద వారు. ఆయన గురించి నేనేమి చెబుతాను. ఆయన గురించి మాట్లాడాలంటే నా వయసు, అనుభవం సరిపోవు...' అన్నారు. నా జీవితంలో మొదటిసారి కన్నీళ్లు వచ్చాయి. ఆ వేడుకలో అందరూ పవన్..పవర్‌స్టార్... అని అరుస్తుంటే.. అంత క్రేజ్ ఉన్న స్టార్ నాగురించి ఆ రెండుమాటలు మాట్లాడేసరికి ఏడుపు ఆపుకోలేకపోయాను.
ఇక త్రివిక్రమ్ మాట్లాడుతూ, నాకిష్టమైన నటులు కోటగారు అని చెప్పారు. ఆయన దర్శకత్వంలో ఎక్కువ చిత్రాలు చేయకపోయినా, నాలోని నటుడుని గుర్తించి ఆయన నాకు వేషాలిచ్చారు. ఇక 'సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రంలో మొదట నాకు వేషం లేదు. కానీ త్రివిక్రమ్ నాకోసం ఓ పాత్రను సృష్టించారు. ఆయన నాతో మీకు తగ్గ పాత్ర అదికాదు.. కానీ ఏమీ అనుకోవద్దు.. అన్నారు. ముచ్చటేసింది. ఆయన నిజాయితీని మెచ్చుకుంటాను. ఇక ఆ చిత్రం షూటింగ్‌లో ఉండగానే నాకు పద్మ అవార్డు వచ్చింది. నిర్మాత చినబాబుగారు కేక్ తెప్పించారు. ఆయన మనసున్న నిర్మాత..అని భావోద్వేగానికి లోనయ్యారు కోట.
ఇక్కడ చాలా మంది.. ఎదుటి వారి నుంచి కోట ఎందుకు గౌరవం ఆశిస్తున్నాడు అనో..లేక మరేదో కామెంట్ చేయవచ్చు. కానీ ఓ కళాకారుడికి అన్నింటి కంటే చివరకు తమ పారితోషికం కంటే గొప్ప బహుమతి పొగడ్త.. చప్పట్లు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి.