తమిళనాడులో బుధవారం జరగనున్న ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో శశికళ వర్గానికి చెందిన దినకరన్ ఓటర్లను మభ్యపెట్టడానికి ఇప్పటి వరకు 89కోట్లు ఖర్చుపెట్టినట్లుగా నిర్ధారించిన ఈసీ ఈ ఉప ఎన్నికలను రద్దు చేసింది. ఆరోగ్యమంత్రి విజయబాస్కర్‌తో పాటు పలువురు మంత్రులు, శరత్‌కుమార్ వంటి వారి ఇళ్లలో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించి పలు కీలకమైన ఆధారాలను సేకరించి, ఈసీకి నివేదిక ఇచ్చింది. దీంతో ఈ ఉప ఎన్నికను ప్రస్తుతానికి రద్దు చేస్తూ ఈసీ సంచలన తీర్పునిచ్చింది. ఈ ఉప ఎన్నికలను తిరిగి జూన్‌లో నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. తాజాగా గుడివాడలో జరిగిన ఓ కౌన్సిలర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిడిపి, వైసీపీ నాయకులు అక్కడ మద్యం వరద పారించారు. ఈ వార్డు మెంబర్ ఎన్నికలలోనే దాదాపు 10కోట్లు ఖర్చుచేసినట్లుగా చెబుతున్నారు...సో.. ఓ కౌన్సిలర్ ఎన్నికలకే ఆ మొత్తం ఖర్చుచేసినప్పుడు అసెంబ్లీ నియోజక వర్గ కీలకమైన ఎన్నికల్లో కనీసం 100కోట్లయినా ఖర్చు చేయకపోతే ఎలా... ?
దయచేసి ఎన్నికల సంఘాలు కూడా ఈ పరిస్థితిని మానవతాదృక్పధంతో ఆలోచించాలి. మన బాగా బలిసిన నాయకులకు కొన్ని మినహాయింపులివ్వాలి, దీనికోసం రాజకీయ పార్టీలు, నాయకులు, ఓటర్లు కూడా తమ హక్కులను కాలరాస్తున్న ఈసీపై ఉద్యమానికి రెడీ కావాల్సిన సమయం ఆసన్నమైంది....! జెపి, పవన్ వంటి వారికి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత, ధనబలం లేకపోతే వారిని ఎన్నికల్లో నిలబడకుండా నిషేదించాలి...!