మంచి కథ దొరికితే విక్టరీ వెంకటేష్, రానాలు కలిసి నటిస్తామని ఎప్పటినుంచో చెబుతున్నారు. ఇక ఆ మంచి తరుణం వచ్చినట్లే కనిపిస్తోంది. వాస్తవానికి తాజాగా విడుదలైన 'గురు' చిత్రాన్ని మొదట వెంకీతోనే తీయాలని దర్శకురాలు సుధా కొంగర భావించింది. కానీ వెంకీకి ఆమె అనుభవం పట్ల అనుమానం వల్లనో ఏమో దానికి నో చెప్పాడు. కానీ ఆమె అదే కథను హిందీ, తమిళంలో తీసిన తర్వాత ఈ చిత్రాన్ని తెలుగులో చేయడానికి వెంకీ ఒప్పుకున్నాడు.
ఇక ఈ కథ రానా వద్దకు కూడా వచ్చింది. కానీ ఆయన కూడా చేయలేదు. ఇక తాజాగా ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో సుధాకొంగర దీనికి సీక్వెల్ కథను ప్లాన్ చేస్తోంది. ఇందులో రానా నటించనున్నాడు. వెంకీ పాత్రను రానా పాత్రతో లింకప్ చేసేలా ఈస్టోరీ ఉండటమే హైలైట్ అంటున్నారు. మరి ఈచిత్రం పట్టాలెక్కితే దగ్గుబాటి అభిమానులకు ఇది శుభవార్తేనని చెప్పాలి.