గత సంక్రాంతికి పోటా పోటీగా విడుదలైన 'ఖైదీ నెంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానంభవతి' చిత్రాలు మూడు ప్రేక్షకుల మన్నన పొంది హిట్ అయ్యాయి. చిరంజీవి, బాలకృష్ణ, శర్వానంద్ లు ముగ్గురు సూపర్ హిట్స్ అందుకుని 2017 సంక్రాతి హీరోలుగా పేరు కొట్టేశారు. అయితే ఏ చిత్రానికి ఎంత వచ్చిందో చెబుతున్నారుగాని... ఎవరిది పై చెయ్యో ఇప్పటివరకు మాత్రం లెక్క తేలలేదు. ఈ ముగ్గురిలో ఎవరు పై చెయ్యి సాధించారో అనే విషయాన్నీ సోషల్ మీడియాలో అటు ఇటుగా ప్రచారం జరిగింది.
అయితే ఈ మూడు చిత్రాలు శాటిలైట్ హక్కుల విషయంలో కూడా బాగానే పోటీ పడ్డాయి. ప్రముఖ ఛానెల్స్ ఈ మూడు చిత్రాలను శాటిలైట్ హక్కులకు భారీ ధరలు చెల్లించి కొనుక్కున్నాయి. ఒక్క ఖైదీ నెంబర్ 150 ని తప్ప మిగతా గౌతమీపుత్ర శాతకర్ణి, శతమానంభవతి చిత్రాలను అప్పుడే టీవీల్లో ప్రదర్శించేసారు కూడాను. గౌతమి పుత్రని మా టీవీ కొనుగోలు చెయ్యగా... శతమానం భవతి చిత్రాన్ని జీ తెలుగు కొనుగోలు చేసింది. అయితే గత వారం ఈ రెండు చిత్రాలను వేర్వేరు టైమ్స్ లో ఆ ఛానెల్స్ వారు ప్రదర్శించారు.
ఈ ప్రదర్శనలో గౌతమిపుత్రని ప్రదర్శించిన మా టీవీకి ఘోరమైన టీ ఆర్పీ రేటింగ్ ని సొంతం చేసుకుంది. కనీసం ఒక సీరియల్ కి వచ్చిన టీ ఆర్పీ రేటింగ్ కూడా గౌతమి పుత్రకి రాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ 5.5 టీఆర్పీ రేటింగ్ చూసి మాటీవీ కి భారీ షాక్ తగిలింది. ఇకపోతే శర్వానంద్ శతమానంభవతి మాత్రం 15.5 రేటింగ్ తెచ్చుకొని సూపర్ అనిపించింది. మరి అప్పుడు డబ్బాలు కొట్టిన ఫ్యాన్స్ ఇప్పుడు ఈ రేటింగ్ చూసి గమ్మునుండి పోయారు. ఒకరకంగా సోషియో ఫాంటసి చిత్రాల కన్నా కుటుంబ కథా చిత్రాలకే ఎక్కువ ఆదరణ ఉందని మరోసారి రుజువైంది.