అనూప్‌రూబెన్స్.. ఈయనపై ఎన్ని ప్రశంసలున్నాయో.. అన్ని విమర్శలున్నాయి. 'ఇష్క్,మనం, గోపాలా..గోపాలా, టెంపర్' చిత్రాలతో ఆయన జాతకమే మారిపోయింది. ఇలాంటి సమయంలో కొన్ని చెత్త నిర్ణయాల వల్ల తన కెరీర్‌ను పాడుచేసుకున్నాడు. అయినా కూడా పవన్ పిలిచి మరీ ఆయనకు 'కాటమరాయుడు' అవకాశం ఇచ్చాడు. కానీ ఈ చిత్రం కూడా సరిగ్గా హిట్ కాకపోయేసరికి మరోసారి అనూప్ కెరీర్ డైలమాలో పడటం ఖాయమని పలువురు భావించారు. కానీ ఇప్పుడు మరో పెద్ద చిత్రాలకు ఆయన పనిచేస్తున్నాడు.
స్వర్గీయ చక్రి తర్వాత పూరీజగన్నాథ్‌తో 'హార్ట్‌ఎటాక్' నుంచి అనూప్ బాంధవ్యం పెరిగింది. 'టెంపర్, ఇజం'లకు కూడా పనిచేశాడు. దీంతో పూరీ అనూప్‌పై ఉన్న నమ్మకంలో ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న చిత్రానికి కూడా అతనికే సంగీత బాధ్యతలను అప్పగించాడు. ఇక 'ఇష్క్,మనం'తో విక్రమ్. కె.కుమార్‌కి అనూప్ బాగా కనెక్ట్ అయ్యాడు.
దీంతో ప్రస్తుతం విక్రమ్. కె.కుమార్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా చేస్తున్న రెండో చిత్రానికి కూడా నాగ్, విక్రమ్‌లు అనూప్‌నే ఎంచుకున్నారు. కాగా అనూప్ అఖిల్ మొదటి చిత్రం 'అఖిల్'కి కూడా తమన్‌తో కలిసి సంగీతం అందించాడు. కానీ ఆ చిత్రం డిజాస్టర్. కానీ నిర్మాత నాగ్, హీరో అఖిల్‌లు అనూప్‌పైనే నమ్మకముంచారు. మరి వీరి నమ్మకాన్ని అనూప్ ఎంతవరకు నిలబెడతాడో వేచిచూడాల్సివుంది...!