ఒక సినిమాలో పరుచూరిగోపాలకృష్ణ ఓ డైలాగ్ చెబుతాడు.. మన పత్రిక... మన కలం.. ఎలా కావాలంటే అలా మార్చిరాయవచ్చనేది ఆ డైలాగ్ సారాంశం. ఇది ఇన్నేళ్లయినా కూడా ఇప్పటికీ నిజమేననిపిస్తోంది. మీడియ విషయంలోనే కాదు.. రాజకీయనాయకులు, కులాల, మతాల వారు, అభిమానులు అదే భ్రమలో బతుకుతున్నారు. దరిద్రపు భావదారిద్య్రం. చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణలో కమ్మలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం లేదని, మంచి శాఖలను కూడా కేటాయించక పోవడం పట్ల ఆయన సామాజిక వర్గ నాయకులు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. మరి చంద్రబాబు కమ్మ వాడైనంత మాత్రాన వారి వారికే పదవులు ఇవ్వాలా? మరోవైపు కాపులు, మైనార్టీ ముస్లింలు, గిరిజనులు, బ్రాహ్మణులు వంటి వారు కూడా తమకు అవకాశం ఇవ్వలేదని మండిపడతున్నారు.
ఇలా కులాల వారీగా, ప్రాంతాల వారీగా ఇచ్చుకుంటూ పోతే ఎలా? పివినరసింహారావు నిజమైన ప్రధాని. సంకీర్ణ ప్రభుత్వాలను ఎలా నడపాలో చూపి, విప్లవాత్మకమైన మార్పులకు తెరతీసి, దేశాన్ని బంగారం కుదువపెట్టే పరిస్థితికి తెచ్చిన దేవగౌడ, గుజ్రాల్, విపిసింగ్, గాంధీ వారసులను లెక్కచేయకుండా ముందుకు నడిపించాడు. ఆయన పుణ్యంగానే నేడు దేశం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ విషయంలో పివి, రాజీవ్‌లకు మనం ఎప్పుడూ రుణపడిఉండాలి.
ధైర్యంగా రాజకీయాలు తెలియని ఆర్దికవేత్త అయిన మన్మోహన్‌సింగ్‌కు ఆర్ధిక శాఖను ఇచ్చి సంస్కరణలు నేర్పాడు. చంద్రబాబుతో పాటు పలువురు తమ ఘనతగా చెప్పుకునే ఐటి, కంప్యూటర్, మొబైల్స్ అన్నింటికీ వారే అసలైన కారకులు. అంత మాత్రాన పీవీ బ్రాహ్మణులకే ప్రాధాన్యం ఇవ్వాలనడం ఎంత తప్పు..? ఆయన్ను కులం కోణంలో చూస్తే ఎలా? రాజశేఖర్‌రెడ్డి బతికి ఉన్నప్పుడు రెడ్లకు ప్రాధాన్యం ఇచ్చాడు. అది అతని నిర్ణయం. ఆయన రెడ్లకే ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు కమ్మలకే ఇవ్వాలనడం సరికాదు.. ఇక్కడ మన అసలు స్వరూపం తెలుస్తోంది.
ఏదైనా నాయకుడు తన కులం వారికే ప్రాధాన్యం ఇస్తే.. తమ కులాన్నే పెంచిపోషించాడని విమర్శలు చేస్తారు. తన కులం వారికి ఇవ్వకుంటే.. సొంత కులానికి, సామాజిక వర్గానికే న్యాయం చేయలేని వారు రాష్ట్రాన్ని, దేశాన్ని ఏం బాగుచేస్తాడంటారు. తన కుటుంబం వారికి ఇస్తే బంధుప్రీతి అంటారు. ఇవ్వకపోతే ముందు ఇంటిని సరిదిద్దుకోమని అంటారు. ఇది న్యాయమా...?