విశాల్ ప్రస్తుతం అప్‌కమింగ్ స్టార్.. తానే నిర్మాతగా సినిమాలు తీస్తూ, హీరోగా పైకెదుతున్నాడు. కాగా ఆయనకు నటుల కష్టాలతో పాటు నిర్మాతల కష్టాలు కూడా తెలుసు. తన తండ్రి జికెరెడ్డి చిన్న సినిమాలు తీశాడు. అప్పట్లో విశాల్ కెరీర్ స్టార్టింగ్‌లో చేసిన చిత్రాలన్నీ ఆనాడు చిన్న చిత్రాలే. వాటిని విడుదల చేయడం కోసం, థియేటర్ల కోసం ఆయన నిర్మాతల మండలిలోని వారికి వంగి వంగి నమస్కారాలు చేసే పరిస్థితి వచ్చింది. స్వతహాగా జికెరెడ్డి కూడా పెద్దనిర్మాతే. ఆయన తెలుగులో చిరంజీవితో 'ఎస్.పి.పరుశురాం' వంటి చిత్రాలు కూడా తీశాడు. కానీ నిర్మాతగా బాగా నష్టాలు రావడంతో ఆయన తన కొడుకుని హీరోని చేసి సినిమాలు తీసి వాటి విడుదలకు నానాకష్టాలు పడ్డాడు.
ఇక విశాల్‌కి వృద్దకళాకారులు,సీనియర్లయిపోయినా ఇంకా జూనియర్ ఆర్టిస్టులుగా బతికే వారి కష్టాలు, కన్నీళ్లు తెలుసు. అందుకే నడిగర్ సంఘం ఎన్నికల్లో గెలిచి, నేడు నిర్మాతల మండలి ఎన్నికల్లో తనతోపాటు తన ప్యానెల్‌ని గెలిపించుకున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన త్వరలో నడిగర్ సంఘం విషయంలో, నిర్మాతలు, పైరసీ వంటి విషయాలలో సంచలన నిర్ణయాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. కానీ మన తెలుగుపరిశ్రమలో దుస్థితి ఎవరికి తెలుసు? ఇక్కడ నటులుగా ఖాళీగా ఉన్నవారు, ఎలాంటి అర్హతలు లేనివారు, సినిమాలు తీయడం మానేసిన సోకాల్డ్ నిర్మాతలు, మూవీ ఆర్టిస్ట్ ఆసోషియేషన్‌లో, నిర్మాతల మండలి, ఫిల్మ్‌చాంబర్స్‌లో కూర్చొని అందరినీ శాసిస్తున్నారు.
బిజీగా ఉన్న హీరోలలో నాగ్ తర్వాత మరలా ఎవ్వరూ 'మా' అధ్యక్షులు కాలేదు. నటులుగా ఖాళీగా ఉండే మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, శివాజీరాజా, నాగబాబు, మురళీమోహన్.. ఇలా ఎందరో ఉన్నత పదవుల్లో పనిచేశారు. వీరు అసమర్దులని చెప్పడం లేదు. వారిలో కూడా మంచి పాలనందించిన వారు ఉన్నారు. కానీ శివాజీరాజా వంటి వారు కఠిన నిర్ణయాలు తీసుకుంటూ మిగిలిన పెద్ద మనుషులు పాటిస్తారా? కాబట్టి మంచి క్రేజ్‌లో ఉన్న వారు ఈ పదవులపై ఎందుకు శ్రద్దపెట్టడం లేదు.
మరి వీరు పరిశ్రమ కోసం, పేద కళాకారుల కోసం ఏయే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు? పైరసీ విషయంలో ఏయే నిర్ణయాలను నిర్మాతల మండలి తీసుకుంది? వీటికి సమాధానం ఉందా? ఈ విషయం గురించి మాట్లాడాలంటే రోజు కూడా చాలదు. చివరగా ఓ ఉదాహరణ. మోహన్‌బాబు 'మా' నాయకునిగా ఉన్నప్పుడు 'మా'లో సభ్యత్వంలేని వారికి సినిమాలలో అవకాశాలు ఇవ్వవద్దు అని చెప్పాడు. ఇది చాలా మంచి నిర్ణయం. కానీ మంచు విష్ణు, మనోజ్ చిత్రాలలో నటిస్తున్న సోకాల్డ్ హీరోయిన్లకు, సన్నిలియోన్‌కు 'మా'లో ఎక్కడ సభ్యత్వం ఉందో ఆయన చెప్పగలరా...?