చంద్రబాబు తన మంత్రివర్గ విస్తరణపై తీవ్ర అసంతృప్తి చెలరేగి, రెబెల్స్ ఎక్కువవుతుంటే కాస్త తెలివిగా వ్యవహరించాడు. అసంతృప్తులను బుజ్జగిస్తూనే తాను రాజకీయ, సామాజిక, ప్రాంతీయ సమీకరణ దృష్ట్యా అలా చేయాల్సివచ్చిందని నచ్చచెప్పాడు. మరోవైపు ఎవరైనా పార్టీకి అతీతులు కాదని, క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ప్రత్యక్షంగా, పరోక్షంగా హెచ్చరించాడు. అందరికీ లేఖలు పంపాడు. మరోపక్క తనదైన శైలిలో తన అనుకూల మీడియా ద్వారా వారికి తగు సూచనలు చేశాడు. ఇక తనకు మంత్రి వర్గంలో స్థానం రాకపోయేసరికి, తానో పెద్ద నాయకునిగా భావించుకుని, మొత్తం కాపు కులానికే తానే సారధినని భావించిన బోండా ఉమా వంటి వారికి హెచ్చరికలు పంపి, తన వద్దకు పిలిచి మందలించాడు.
ఇక్కడ బోండా ఉమా సంగతి కూడా చెప్పుకోవాలి. తనకు మంత్రి పదవి రాకపోయేసరికి రాష్ట్ర వ్యాప్తంగా తన అభిమానులు, కార్యకర్తలు బాధగా ఉన్నారని, కాపుల గొంతు మరోసారి చంద్రబాబు కోశాడని మండిపడ్డాడు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలో అంతటి ఫాలోయింగ్ ఉందని ఆయనకు తప్ప మరెవ్వరికి తెలియకపోవడం ఆశ్చర్యం. ఇక బోండా ఉమ తాను జనసేన తరపున పవన్ పిలిచినా పార్టీలోకి వెళ్లకుండా, టిడిపిలోనే ఉన్నానని చెప్పాడు. ఇప్పటి వరకు వున్న సమాచారం ప్రకారం పవన్ ఇప్పటి వరకు ఏ నాయకుడిని తన పార్టీలో చేరమని అడగలేదు. మరీ ముఖ్యంగా కులనాయకులను కలవడానికి కూడా ఇష్టపడటం లేదు. మరి బోండా ఉమను పవన్ ఎప్పుడు జనసేనలోకి రమ్మన్నాడో? ఎవ్వరికీ అర్ధం కావడం లేదు.