ఈ మధ్య పలు హీరోల చిత్రాలను బాగా ఎక్కువ రేటుకు కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఆయా చిత్రాలు ఫ్లాప్ అయితే ఆయా హీరోలను బదనాం చేసి, ఒక విధంగా చెప్పాలంటే ఆయా హీరోల ఇమేజ్‌ను అడ్డుపెట్టుకుని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. నాన్ రికవబుల్ అగ్రిమెంట్ల మీద సంతకాలు చేసి, తీరా లాభాలు రాకపోతే హీరోలను, నిర్మాతలను టార్గెట్ చేస్తున్నారు. కానీ ఇది మంచి సంప్రదాయం కాదు. లాభాలు వస్తే ఆయా డిస్ట్రిబ్యూటర్లు అదనంగా నిర్మాతలకు, హీరోలకు కూడా ఇవ్వరు కదా? అనేది చాలా ప్రశ్నగా మారింది. గతంలో సినీజోష్ ఈ విషయంలో డిస్ట్రిబ్యూటర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చిపడుతోంది. తమిళంలో రజనీలాగా ఈ దుస్సంప్రదాయానికి తన పాపభీతి, మంచితనంతో పవన్ 'జానీ'తో తెరతీశాడు. ఇప్పుడు ఆ మంచితనమే ఆయన పరువుతో ఆడుకుంటోంది. డిస్ట్రిబ్యూటర్లను మోసం చేసిన వాడిగా ముద్రను వేస్తోంది. ఆయన ఇమేజ్‌ను దెబ్బతీస్తోంది. కాగా అన్ని విషయాలపై ఆవేశంతో, ఆలోచనతో రగిలిపోయి ఎంతో ఆలోచనాత్మకంగా మాట్లాడుతున్న పవన్ 'సర్దార్‌గబ్బర్‌సింగ్'లో నష్టపోయామని ధర్నా, నిరాహార దీక్షలు చేస్తున్న సంపత్ వంటి వారి వ్యవహారంపై ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు వారి చర్యలను ఖండించడం లేదు? అలాంటి డిస్ట్రిబ్యూటర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించినా కూడా పవన్‌కి అనుకూలంగానే తీర్పు వస్తుందనేది వాస్తవం. మరి అలాంటి వారిని పవన్ ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? వాస్తవానికి సామాన్య ప్రేక్షకులకి ఇవ్వన్నీ అర్థం కావు.
దాంతో సామాన్య ప్రేక్షకులు, ఆయన యాంటీఫ్యాన్స్, రాంగోపాల్ వర్మ నుంచి బాలీవుడ్ పనికి మాలిన క్రిటిక్ కూడా పవన్‌పై దొంగ అని ఆరోపణలను భరించాల్సిన అవసరం పవన్‌కి ఏముంది? అసలు పవన్ ఎందుకు ఓపెన్ కావడం లేదు? రాష్ట్ర,దేశ సమస్యలపై కూడా ఎవ్వరికీ భయపడకుండా ప్రశ్నిస్తున్న పవన్ ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? అసలు 'సర్దార్' డిజాస్టర్ తర్వాత ఆయన ఆ నష్టాల కోసం శరత్‌మరార్‌కి, ఆయా డిస్ట్రిబ్యూటర్లకు మరో చిత్రం చేస్తానని ఎందుకు హామీ ఇచ్చాడు? ఈ విష సంస్కృతిని ఆయనెందుకు ప్రోత్సహిస్తున్నాడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది...!