సినిమాలకు ఇచ్చే అవార్డ్సుపై ఎవ్వరికీ సదాభిప్రాయం లేదు. నంది అవార్డులు, జాతీయ అవార్డుల నుంచి ప్రవేట్ చానెల్స్, పత్రికల యాజమాన్యాలు ఇచ్చే అవార్డుల వరకు ఇదే ధోరణి. కాగా దీనిపై 'పెళ్లిచూపులు'తో సంచలనం సృష్టించిన కొత్త దర్శకుడు తరుణ్‌భాస్కర్ కాస్త ఘాటుగానే విమర్శలు చేశారు. ఐఫా అవార్డు తర్వాత ఆయన చేసిన ట్వీట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి.
ఈయన మాట్లాడుతూ. ఇలాంటి అవార్డు వేడుకలు సినిమా వారిలోని టాలెంట్‌ను ప్రోత్సహించడానికి కాదు. చానెళ్ల కోసం, డబ్బుల కోసమేనని మండిపడ్డాడు. తమ చిత్రానికి గాను ప్రియదర్శికి అవార్డు రావడం ఆనందంగానే ఉన్నా తమ చిత్రానికి సరైన గుర్తింపు ఇవ్వలేదన్నాడు. కేవలం మా చిత్రానికి ఇవ్వనందుకు కాదు.. కనీసం 'క్షణం' చిత్రానికి అవార్డులు ఇచ్చి ఉన్నా కూడ నేను గర్వంగా తలెత్తుకునే వాడినని ఆవేదన వ్యక్తంచేశాడు. మనం ఇంకా స్టార్‌డం చుట్టూనే వేలాడుతున్నాం. వాటి చుట్టూనే తిరుగుతున్నాం. చిన్నసినిమాలను పొగడాలంటేనే చాలా మంది భయపడిపోతున్నారు. స్టార్స్ మెప్పుకోసమే తాపత్రయపడుతున్నారు. ఈ విషయంలో కన్నడ పరిశ్రమను మెచ్చుకోవాలి. నిజమైన టాలెంట్‌కే అక్కడ అవార్డులు వస్తున్నాయి.
ఇక మంచి సినిమాలకు ప్రోత్సాహం లేనప్పుడు ఎవరైనా అలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తారు? గుర్తింపులేకపోతే ఎవరు ముందుకొస్తారు? కానీ నేను మాత్రం స్టార్స్‌తో చిత్రాలు చేయను. ఇలా చిన్న వారితో మాత్రమే చిత్రాలు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నానని తెలిపాడు. కానీ ఒక్క సినిమాకే ఈ విధంగా డీలాపడి, నిరుత్సాహపడితే ఎలా? సినిమా రంగం గురించి కుర్రాడికి ఇంకా పూర్తిగా బోధపడలేదనే చెప్పాలి.