అధికారంలో ఉన్న వారు తప్పు చేయడం, ప్రజాసమస్యలను కప్పిపుచ్చడం మామూలే. ఇక ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేయాలని భావించి, ఓటు రాజకీయాలు చేస్తుంటారు. మీడియా వాటిని హైలైట్ చేసి సర్క్యులేషన్స్‌ని, టీఆర్పీలను పెంచుకుంటాయి. కానీ ప్రజాసమస్యలపై ప్రతిపక్షాలు, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన మీడియా వంటి వారు నిజాయితీ మాట్లాడితే ఎంత ప్రయోజనం ఉంటుందో అగ్రిగోల్డ్ పెద్ద ఉదాహరణ. తప్పు ఎవరిదైనా కానివ్వండి.. ఈ విషయంలో కాంగ్రెస్, వైసీపీ, జనసేన అధినేత పవన్ అందరూ ఆలస్యంగానైనా స్పందించారు. దీంతో హుటాహుటిన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలలో, సిఐడి అధికారులలో స్పందన వచ్చింది. ఆస్తులను అటాచ్ చేసి అమ్మి ఖాతాదారులకు చెల్లించాలా? లేక కేసు కోర్టులో ఉన్నందువల్ల ఈ విషయాన్ని కోర్టుకి వదిలేయాలా? అనే విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇది అభినందనీయం.
కానీ వైసీపిని మాత్రం ఓ విషయంలో తీవ్రంగా తప్పుపట్టాలి. ఆ పార్టీ నాయకులు, అధ్యక్షుడు శవాలపై చిల్లర ఏరుకునేలా, ప్రతి దానికి ఓటురాజకీయం చేస్తూ, నానా హంగామా చేస్తున్నారు. అగ్రిగోల్డ్ గురించి ముందు స్పందించింది మేమేనని, మెగా ఆక్వా ఫుడ్ విషయంలో, పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజీలో, ఇటీవల జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదం విషయంలో ముందుగా తామే గళమెత్తామని చెప్పుకోవడానికే వారికి సమయం సరిపోవడం లేదు. మరి జగన్ స్వయంగా బస్సు ప్రమాద బాధితులను కలిసి కలెక్టర్‌ను, డాక్టర్లను పోస్ట్‌మార్టం విషయంలో నానా హంగామా చేసి మీడియా పతాక శీర్షికల్లోకి ఎక్కాడు. ఆయన ఓటు రాజకీయం కూడా ఫలించిందే అనుకుందాం... మరి ఆ బస్సు ప్రమాద మృతుల విషయంలో ఆయన మరలా ఫాలోఅప్ చేశాడా అనేది ఎవరైనా చెప్పగలరా?
మేమే ముందు సమస్యను లేవనెత్తామని చెప్పి ఓటు రాజకీయాలు చేయదలుచుకుంటే ఎలక్షన్ల సమయంలో చేసుకోండి. కానీ ప్రతిరోజు, ప్రతి విషయంలోనూ పాడిందే పాడరా.. పాచిపళ్లదాసుడా...! అంటే ఎలా? ఈ విషయంలో పవన్‌ని మెచ్చుకోవాల్సిందే. ఆయన ఇప్పటికే తాము ప్రతి విషయాన్ని రాజకీయం చేయమని, సమస్య లోతుపాతులు, ప్రభావం తెలుసుకొని మాట్లాడుతామని ప్రకటించాడు. మరి జగన్ నుంచి అలాంటి ప్రకటనను ఆశించవచ్చా....?