మన సీనియర్ టాప్‌స్టార్స్‌లో వయసును గుర్తించి కొత్త తరహా చిత్రాలను ఎంకరేజ్ చేసేవారిలో విక్టరీ వెంకటేష్ పేరును ముందు చెప్పుకోవాలి. హీరోగా తన కెరీర్‌లో ఎన్నో మంచి చిత్రాలు చేసిన ఆయన ప్రస్తుతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్లు, గోపాల.. గోపాల..' వంటి చిత్రాలకు తెరతీశారు. ఇక 'దృశ్యం' చిత్రంలో ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా తన వయసుకు తగ్గ పాత్ర చేశాడు. ఎంతో కాలంగా రాని సోలో హిట్‌ను వెంకీకి ఈ చిత్రం అందించింది. ఇక రొటీన్‌గా చేసిన 'బాబు బంగారం'తో ఆయనకు పూర్తి వాస్తవాలు తెలిశాయి. దాంతో మిడిల్ ఏజ్‌డ్ బాక్సింగ్ కోచ్‌గా ఆయన నటించిన 'గురు' చిత్రం చాలా బాగుందనే ప్రశంసలు లభిస్తున్నాయి.
బాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రశంసల దగ్గరే ఆగిపోయిన ఈ చిత్రం తెలుగులో లోబడ్జెట్‌తో నిర్మించిన కారణంగా కమర్షియల్‌గా కూడా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఇందులో రాజకీయాలకు బలైపోయిన బాక్సర్‌గా, బాక్సింగ్ కోచ్‌గా నటించిన వెంకీ అదరగొట్టాడు. తన వయసుకు తగ్గ వేషధారణ, హావభావాలతో మెప్పించాడు. ఇక రాబోయే రోజుల్లో కూడా తాను తన వయసుకు తగ్గ పాత్రలనే చేస్తానని, విభిన్న చిత్రాలను ఎంచుకుంటానని ఆయన ప్రకటించడం చూస్తే కొత్తతరం రచయితలు, దర్శకులకే కాదు.. సినీ ప్రేమికులకు కూడా ఆనందం కలుగుతుంది. ఆరుపదుల వయసులో కూడా ఐటం సాంగ్స్, మనవరాలి వయసున్న భామతో రొమాన్స్..స్టెప్స్ చూసేవారికి వెంకీ మాటలు పెద్ద రిలీఫ్...!