కొందరు పవన్ అగ్రిగోల్డ్ విషయంలో అయోమయంలో మాట్లాడాడని, కానీ ఆయనకు ఈ సమస్యపై సరైన అవగాహన లేదని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక్క విషయం తెలుసుకోవాల్సివుంది. పవన్ వంటి వ్యక్తులు వ్యక్తిగత విమర్శలకు దూరంగా ఉండాలి. వ్యవస్థను, దానిలోని లోపాలను టార్గెట్ చేయాలి. పవన్ అగ్రిగోల్డ్ విషయంలో అదే చేశాడు. ఈ వైట్‌కాలర్ మోసాలను, ఆర్థిక నేరాల కారణాలపై ఆయన దృష్టి పెట్టారు.
వాస్తవానికి ఈ సంస్థను 1995లో ప్రారంభించారు. ప్రభుత్వ పెద్దలు.. తమ ఎన్నికల ఫండ్స్ కోసం ఈ సంస్థలు బాగా పనిచేస్తున్నాయని, ప్రజలకు సేవ చేస్తున్నాయని ప్రశంసించి ఎన్నో సభలో అవార్డులు, శాలువాలు కప్పారు. ఇక ఈ భాగోతం బయటపడిన 2014 తర్వాత కూడా ఈ సంస్థకు చెందిన ఓ డైరెక్టర్‌ను చంద్రబాబు సన్మానించాడు. ఇక్కడ వైఎస్‌ది, చంద్రబాబుది, అందరిదీ తప్పుంది. శారదా చిట్స్, సహారాతో పాటు అగ్రిగోల్డ్ అనే కాదు.. ప్రతి గోల్డ్( వైజాగ్‌లో అక్షయ్‌గోల్డ్, నెల్లూరులో సిరి గోల్డ్) వన్నీ ఈ బాపతే. మొదట్లో చెక్‌లు బౌన్స్ అయినప్పుడు ప్రభుత్వం స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. ఇదే విషయాన్ని పవన్ చెప్పారు.
ఇక దక్షిణాది రాష్ట్రాలతో పాటు 9రాష్ట్రాలలోని ప్రజలను అగ్రిగోల్డ్ యాజమాన్యం మోసం చేస్తే ఇప్పటివరకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు. ఆస్తుల వేలంలో ప్రభుత్వ నేతలు పెద్దగా పనిచేయడం లేదని, బలహీనులైన, బాధితుల మీద పోలీస్‌లను, చట్టాలను మోపి దౌర్జన్యం చేయడం సరికాదని, చట్టాలు బలవంతులపై బలహీనంగా, బలహీనులపై బలంగా పనిచేస్తున్నాయని అక్షర సత్యం తెలిపారు.
కానీ పవన్ ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టి మోసపోయే సామాన్యులలో ఇకపై అలా చేయకుండా చైతన్యం తేవాలి.. ! మరోపక్క పవన్ పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధితుల స్థానంలో తమ మాటల చాకచక్యంతో మమ్మల్ని చూసి చేరండి.. వారివ్వకపోయినా మేమున్నాం కదా..! అంటూ 100కు 10రూపాయలు కమిషన్ తీసుకొని కోట్లాది రూపాయలను కట్టించిన ఏజెంట్లపై సానుభూతి తెలపడం సరికాదు. దీనికి ప్రధాన కారకులు ఏజెంట్లే. మాటల నేర్పరితనంతో వారు ప్రజలను మోసం చేశారు. పెట్టుబడులు పెట్టిన వారిలో అనేకులు అగ్రిగోల్డ్‌పై ఉన్న నమ్మకం కంటే ఏజెంట్లనే నమ్మారు. ఇలా కమిషన్ల పేరుతో కొట్లాది రూపాయలను సంపాదించి, ఇప్పుడు మమ్మల్నేం చేయమంటారు? మీరే పరిస్థితి చూస్తున్నారు కదా! మీరు బలవంతం చేస్తే మీరే మా చావుకు కారణం అని రాసిపెట్టి మేమే చనిపోతే మీ మీదనే కేసులు వస్తాయి.. అని బెదిరించే మాటలునేర్చిన ఏజెంట్లకు పవన్ వంతపాడటం సరికాదు.