ఓ చిత్రం రూపొందుతుందంటే చాలు ఆ చిత్రం లుక్, టైటిల్స్ వంటివి ఏ చిత్రానికి కాపీ అనే విషయంలో వార్తలు హల్‌చల్ చేస్తుంటాయి. కానీ దీనికి మీడియాను కూడా తప్పుపట్టలేం. కారణం ఏమిటంటే.. మన దర్శకనిర్మాతలు, హీరోల క్రియేటివిటీ విషయంలో మనకు అంత నమ్మకం ఉంది. అదే దీనికి కారణంగా చెప్పవచ్చు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ 'జనతాగ్యారేజ్' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'సర్దార్' వంటి డిజాస్టర్ ఇచ్చిన బాబి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్ తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు.
'టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత ఎన్టీఆర్ ఎందరో దర్శకులను, వారి కథలను విని, చివరకు బాబికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఈ చిత్రంలో సమ్‌థింగ్ ఏదో స్పెషల్ ఉందని అర్ధమవుతోంది. ఇక ఈచిత్రానికి 'జై లవ కుశ' అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి బలం చేకూరుస్తూ ఈ చిత్రంలోని ఓ ఫొటోలో ఎన్టీఆర్ టేబుల్‌పై 'లవకుమార్' అనే నేమ్ బోర్డ్ కనిపించింది. దీంతో ఈ చిత్రంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయంతో పాటు 'జై లవ కుశ' అనే టైటిల్ విషయంలో మీడియాలో వస్తున్న వార్తల్లో నిజముందని చాలా మంది నమ్ముతున్నారు.
ఇక ఈ చిత్రం దాదాపు 10ఏళ్ల కిందట తమిళంలో అజిత్ హీరోగా తెరకెక్కిన 'వరలారు' ఆధారంగా రూపొందుతోందని... ఇందులో తండ్రి పాత్ర.. అతనికి ఇద్దరు కవల పిల్లలు ఉంటారని, ఇద్దరు కవలలో ఒకరు క్లాసిక్ డ్యాన్సర్‌కాగా, మరో పాత్ర నెగటివ్ షేడ్స్‌లో ఉంటుందని సమాచారం. ఇక ఈ అజిత్ చిత్రం కూడా ఓ విదేశీ చిత్రం నుంచి ఇన్‌స్పైర్ పొందిన కథ ఆధారంగానే రూపొందిందని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ చిత్రం విషయంలో వస్తున్న ఈ ప్రచారం నిజమా? కాదా? అనేది సినిమా విడుదలైతే గానీ తెలియదు.