ప్రస్తుతం తెలుగు చిత్రాలకు ఓవర్‌సీస్ మార్కెట్ అనూహ్యంగా పెరిగింది. అక్కడి ప్రేక్షకులు కుటుంబ బంధాలు, అనుబంధాలు, ఎంటర్‌టైన్‌మెంట్, వైవిధ్యభరితమైన చిత్రాలు, ప్రయోగాత్మక, అచ్చ తెలుగు చిత్రాలను బాగా ఆదరిస్తున్నారు. దీంతో నిన్న మొన్నటి వరకు పక్కా మాస్ మసాలా చిత్రాలను, కమర్షియల్ ఫార్ములాలను నమ్ముకున్న రామ్‌చరణ్ నుంచి కుర్రహీరోలు, చిన్న హీరోలు కూడా అలాంటి చిత్రాలనే ఎంచుకుంటున్నారు. 'పెళ్లిచూపులు' వంటి చిత్రం కూడా ఓవర్‌సీస్‌లో డాలర్స్ వర్షం కురిపించడంతో మన వారిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
ఓవర్‌సీస్ మార్కెట్‌లో ఎన్నో దేశాలున్నా కూడా ఓవర్‌సీస్ అంటే మనకు యూఎస్ మాత్రమే గుర్తుకొస్తుంది. కాబట్టి ఇప్పుడు మన హీరోలందరూ యూఎస్‌లోని తెలుగు మార్కెట్‌పై కన్నేశారు . ఇక కొందరు కుర్రహీరోలైతే తమ చిత్రాలను కూడా ఎక్కువగా యూఎస్‌లో ప్లాన్ చేస్తున్నారు. సాయిధరమ్‌తేజ్ నటించిన 'సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్' చిత్రంలో అధికభాగాన్ని అక్కడే తీశారు. ఇక ఇటీవల నాని కూడా తాను నటిస్తున్న తాజా చిత్రం 'నిన్నుకోరే'ని 60శాతం అమెరికాలో పూర్తి చేసి ఇటీవలే ఇండియా వచ్చాడు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.
నాని అమెరికా ఫ్టైట్ దిగగానే మరో యంగ్ హీరో నితిన్ అక్కడి ఫ్లైట్ ఎక్కుతున్నాడు. తాజాగా హనురాఘవపూడి దర్శకత్వంలో 14రీల్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం షూటింగ్ రెండు నెలల పాటు అమెరికాలో జరగనుంది. త్వరలో 'ఆచారి అమెరికా యాత్ర' లో నటిస్తున్న మంచు విష్ణు కూడా ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ శాతం అమెరికాలో ప్లాన్ చేస్తున్నాడు. మొత్తానికి మన హీరోలందరూ ప్రస్తుతం డాలర్స్ డ్రీమ్స్ కంటున్నారు.