జయలలిత మరణించడం, కరుణానిధి వృద్దాప్యం వల్ల తమిళ రాజకీయాలలో శూన్యత ఏర్పడింది. మరోవైపు నిమిష నిమిషానికి మనసు మార్చుకుంటూ, రాజకీయాలలోకి వచ్చే అవకాశం కాదనడం లేదని ఒకసారి, దేవుడు ఆజ్ఞాపిస్తే వస్తానని ఒకసారి, ఇలా పిరికి మనస్తత్వాన్ని, చంచలత్వాన్ని, నిర్ణయలేమిని చూపుతున్న రజనీకాంత్ అంటే తమిళనాడులో కూడా రాజకీయాల పరంగా సరైన సానుకూలత లేదు. మొదట్లో ఉన్నా కూడా దానిని రజనీ నిలబెట్టుకోలేకపోయాడు. కొంతమందైతే రజనీని.. చిరంజీవి, పవన్‌కళ్యాణ్, విజయ్‌కాంత్‌ల కంటే ఘోరమని, వారు కనీసం ధైర్యం చేశారని, కానీ ఆయన అది కూడా చేయడం లేదని ధ్వజమెత్తుతున్నారు.
ఇక అమ్మ జయలలిత తాను బతికున్నప్పుడు తన వారసునిగా భావించిందని పలువురు చెబుతున్నా కూడా అజిత్ దానిని సద్వినియోగం చేసుకోవడం లేదు. విజయ్ కూడ జయ బాధితుడే. దాంతో కిందటి ఎన్నికల్లో ఆయన మోదీకి ఓటు వేయమని చెప్పాడు. కానీ అనుకున్నది జరగలేదు. పదేళ్ల కిందటే రాజకీయాలలోకి రావాలనుకున్నాడు. కానీ వయసు సరిపోదని విరమించుకున్నాడు. కాగా విజయ్ మాత్రం పవన్‌లాగానే తెగింపు ఉన్నవాడు. విజయమో.. వీర స్వర్గమో అని భావించేరకం. కాబట్టి ఆయన రాజకీయ అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. కానీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో సమయం ఉంది. ఈలోపు ప్రభుత్వం పడిపోయి ఎన్నికలు వస్తే విజయ్ ఖచ్చితంగా పాలిటిక్స్‌లోకి వస్తాడు. కానీ మధ్యంతర ఎన్నికలు జరగకపోతే మాత్రం ఎన్నికల ముందు మాత్రమే వస్తాడు.
కానీ ఆయన తండ్రి మాట్లాడుతూ, నేడు ఎన్నికలు.. బిజినెస్ అయిపోయాయని దాంతో విజయ్ ఇప్పుడు రాజకీయాలలోకి ఎంటర్ కాకపోవడమే మంచిదంటున్నాడు. కానీ ఇది నిజం కాదని, ఇప్పుడు మాత్రమే తమిళనాట రాజకీయశూన్యత ఉందని, ఆర్కేనగర్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చిన తర్వాత విజయ్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాడని భావిస్తున్నారు.