మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ మహానటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సావిత్రి జీవిత కథ అంటే అది మామూలు విషయం కాదు. ఆమె జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఆమె సినీజీవితం ఒక ఎత్తైతే నిజ జీవితం మరొక ఎత్తు. మరి అలాంటి కథని నాగ్ అశ్విన్ ఏ విధంగా డైరెక్ట్ చేస్తాడో గాని ఈ భారీ చిత్రాన్ని మాత్రం నాగ్ అశ్విన్ మామగారు... మెగా ప్రొడ్యూసర్ అశ్విని దత్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మహానటి పాత్రకి కీర్తి సురేష్ ని తీసుకోగా సమంత ని మరో ముఖ్య పాత్రకి తీసుకున్నాడు నాగ్ అశ్విన్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకెళ్లబోతుందని సమాచారం.
అయితే సావిత్రి నిజ జీవితం, సినీజీవితం ఒక్క తెలుగుకే పరిమితం కాదు. ఆమె తమిళంలో కూడా టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పింది. అందుకే రెండు భాషలకు సుపరిచితులైన కీర్తిని, సమంతని తీసుకున్న అశ్విన్ ఇప్పుడు సావిత్రి జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి శివాజీ గణేశన్ పాత్ర కోసం తమిళ హీరో సూర్యని నాగ్ అశ్విన్, అశ్విని దత్ సంప్రదించినట్లు వార్తలొస్తున్నాయి. అయితే సూర్య తన నిర్ణయాన్ని ఇంకా చెప్పలేదనే టాక్ నడుస్తుంది. సావిత్రి జీవితంలో శివాజీ గణేష్ పాత్ర కొంచెం నెగెటివ్ గా ఉంటుంది. మరి సూర్య ఆ నెగెటివ్ షేడ్స్ వున్న కేరెక్టర్ లో కనబడడానికి ఒప్పుకుంటాడో? లేదో? అనేది సందేహమే.
వీరితోపాటు మలయాళ నటుడు పృద్వి రాజ్ కీలక పాత్ర లో నటిస్తున్న మహానటి చిత్రంలో మరికొంతమంది ప్రముఖులు కూడా కనిపిస్తారని చెబుతున్నారు. సినిమా తెరకెక్కకముందే ఈ చిత్రానికి విపరీతమైన క్రేజ్ వస్తుంటే ఇక సినిమా మొదలు పెట్టి సెట్స్ మీదకెళ్లాక.. సావిత్రి ఇంకెన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో అని అంటున్నారు విశ్లేషకులు.