రజనీకాంత్ మౌనంగా ఉన్నా సరే ఆయన్ను మన వారు బయటకు తెచ్చి వివాదాలను ఆయనకు అంటగడుతున్నారు. కాగా ఇటీవల ఆర్కేనగర్ బిజెపి అభ్యర్థి, ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ రజనీని కలిశాడు. దీంతో రజనీ బిజెపికి మద్దతిస్తున్నాడంటూ కొన్ని పార్టీలు ఆయనపై బురద జల్లాలని చూశాయి. దీంతో స్వయంగా రజనీకాంత్ ప్రస్తుతం తాను ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ఇక శ్రీలంకకు చెందిన లైకా ప్రొడక్షన్స్ బేనర్‌లో రజనీ '2.0' చిత్రం చేయడాన్ని కూడా కొందరు తప్పుపట్టారు. ఇప్పుడు ఇదే సంస్థకు చెందిన మరో వివాదంలో రజనీ చిక్కుకున్నాడు. శ్రీలంకలోని జాఫ్నాలో శ్రీలంకలోని తమిళశరణార్ధుల కోసం లైకా సంస్థ తమ ట్రస్ట్ తరపున తమిళ ప్రజలకు కోట్లు ఖర్చుపెట్టి ఇళ్లను కట్టించింది. ఈ ఇళ్లను బాధితులకు అప్పగించే కార్యక్రమం ఏప్రిల్9న జాఫ్నాలో చేయాలని భావించారు. ఈ సందర్భంగా రజనీని జాఫ్నాకి పిలిచి అక్కడ ఆయన చేతులు మీదుగా లబ్దిదారులకు ఇళ్ల తాళాలను అప్పగించి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ ప్లాన్ చేసింది.
కానీ లైకా ప్రొడక్షన్ సంస్థ శ్రీలంకలోని తమిళ శరణార్ధుల పట్ల గతంలో తప్పుగా వ్యవహరించినందు వల్ల రజనీ ఆ కార్యక్రమానికి రావడానికి వీలులేదని కొన్ని తమిళ సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు వివాదాన్ని రేపాయి. శ్రీలంకలో సైన్యం తమిళులను ఊచకోత కోసిందని, కానీ అప్పుడు వాటిని ఖండించని రజనీ ఇప్పుడు శ్రీలంక ఎలా వెళ్తాడని అవి ఆందోళన మొదలు పెట్టాయి. దీంతో రజనీ ఈ వివాదానికి కూడా ఫుల్‌స్టాప్ పెట్టాడని.. శ్రీలంక పర్యటనకు వెళ్లడం లేదని తాజా సమాచారం.