‘షమితాబ్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అక్షరహాసన్ తాజాగా ఓ హిందీ చిత్రం ప్రమోషన్ లో బిజీగా ఉంది. కమల్‌హాసన్ చిన్న కూతురు, శృతిహాసన్ కు చెల్లెలు అయిన అక్షర 'లాలీ కీ షాదీ మే లడ్డూ దీవానా' అనే చిత్రంతో నటిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. అయితే తాజాగా ఈ చిత్రం ప్రచారంలో భాగంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై మీడియా రాద్ధాంతం చేస్తుంది. అయితే అక్షర హాసన్ ఆరోగ్యం ఏమాత్రం బాగలేకపోయినప్పటికీ మీడియా ఇంటరాక్షన్‌కి వచ్చిందట. కానీ అక్కడ ఎక్కువ సమయం తీసుకోవడంతో నీరసించిన అక్షర కాస్త కటువుగా రియాక్టయిందని మీడియాలో టాక్ నడుస్తుంది.
అసలే అనారోగ్యంతో బాధపడుతున్న అక్షర హాసన్ కు డాక్టర్ అపాయింట్ మెంట్ ఉండటంతో మీడియాతో ముఖాముఖి త్వరగా ముగించుకొని అక్కడ నుండి బయలుదేరిందంట. అయితే అలా వెంటనే వెళ్ళిపోవడానికి లేదని ప్రెస్ మీట్ నిర్వహకుడు ఆమెను వారించాడంట. దాంతో ఆగ్రహించిన అక్షర అతడిపై గట్టిగానే కేకలు వేసినట్లుగా తెలుస్తుంది. ఇంకా ప్రెస్ మీట్ పూర్తికాకుండానే వెళ్తున్నారేంటి అని అడిగిన జర్నలిస్ట్ పై కూడా అక్షర మండిపడిందని తెలుస్తుంది. దీంతో అక్షర హాసన్ కు అస్సలు క్రమశిక్షణ లేదని, చాలా పొగరుబోతని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇలా పలు కథనాలు కూడా ఆమెపై ప్రసారం చేస్తున్నారు.
ఈ హిందీ చిత్రంలో జంటగా నటిస్తున్న వివాన్‌షా మాట్లాడుతూ... అలాంటి పరిస్థితుల్లో తాను ఉన్నా అలాగే రియాక్ట్ అవుతానని వెల్లడించాడు. అంతేకాకుండా ప్రెస్ మీట్ ఆర్గనైజర్ కూడా అక్షర చేసిన దాంట్లో ఎలాంటి తప్పిదం లేదని, ఆ సమయంలో అక్షర కోప్పడటం జరిగిందని, అయితే వెంటనే ఆమె సారి చెప్పిందనీ, అనవసరంగా మీడియా దీన్ని రాద్ధాంతం చేస్తుందని వివరించింది. మొత్తానికి ఒక్క ఈ ఘటనతోనే అక్షర బాలీవుడ్ మీడియాలో బీభత్సంగా పేరు సంపాదించింది. అసలే దక్షణాది తారలను ఎప్పుడెప్పుడు తొక్కేద్దామని కాచుకు కూర్చుంటుంది బాలీవుడ్. మరి ఇలాంటి ఘటన ద్వారా అక్షర ఎలాంటి మైలేజ్ ను పొందిందో ముందు ముందు తెలుస్తుంది.