పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. కానీ ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం కనిపించలేదు.ముఖ్యంగా దేశంలోని కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో బిజెపి ఘనవిజయం సాధించడం మోదీకి ప్రజలిచ్చిన తీర్పుగా చాలా మంది భావిస్తున్నారు. ఒక వైపు అఖిలేష్, ములాయంల మధ్య కుటుంబ విభేదాలు, కాంగ్రెస్‌తో ఎస్పీ జతకట్టడం, రాహుల్‌గాంధీ మ్యాజిక్‌లు పనిచేయకపోవడం, మెజార్టీ స్థానాలలో గోవా, మణిపూర్‌లలో గెలిచినా కాంగ్రెస్ వ్యూహకర్తల తప్పు వంటి అనేక పరిణామాలు బిజేపీకి కలిసివచ్చాయి.
ఇక మోదీ బిజెపి పాలిత, బిజెపికి మంచి పట్టున్న రాష్ట్రాలలో కరెన్సీ కొరత లేకుండా చూస్తూ, ఈ నిర్ణయం పట్ల ప్రజల్లో వ్యతిరేకత కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, ఆర్‌బిఐ వంటి స్వతంత్ర సంస్థను శాసిస్తున్నాడని, కానీ బిజెపికి అసలు పట్టులేని, వారికి ఎలాంటి ఆశలు లేని రాష్ట్రాలలో మాత్రం ఎంత కరెన్సీ కొరత ఉన్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో మోదీకి లభించిన విజయంతో ఆయనలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం ద్విగుణీకృతమయ్యాయనేది వాస్తవం. దాంతో ఆయన మరిన్ని కీలకనిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతున్నాడు. మరోవైపు యూపీకి ఆర్‌ఎస్‌ఎస్ వ్యూహంలో భాగంగా యోగిని తీసుకుని మంచి పనే చేశాడు. ఇది మతపరంగా, కులపరంగా మోదీకి యూపీలో పెద్ద మద్దతునిస్తుంది.
ఇక యూపీలో గెలిచిన వెంటనే సుప్రీం కోర్డు సైతం అయోధ్య విషయంలో కీలకవ్యాఖ్యలు చేయడం గమనార్హం. రామమందిరం అంశాన్ని బిజెపి జాతీయస్థాయిలో పక్కనపెట్టినా కూడా ఆ రాష్ట్ర ఎన్నికల్లో మాత్రం మేనిఫెస్టోలో పెట్టింది. దీంతో ఇప్పటికే సద్దుమణిగిన ఈ వ్యవహారం మరెన్ని ముప్పులను తెచ్చిపెడుతోందో? అనే భయం చాలామందిని పీడిస్తోంది. దీంతో పాటు కర్ణాటకలో బలం పెంచుకోవడానికి కీలక కులంలో ఉన్న మాజీ సీఎం, కాంగ్రెస్ నేత ఎస్.ఎం.కృష్ణను బిజెపిలో చేర్చుకుంటున్నారు. కానీ ఈయనపై, ఈయన అల్లుడిపై ఎన్నో అవినీతి ఆరోపణలు, తెల్గీకుంభకోణం వంటివి ఉన్నాయి. మరోవైపు అవినీతి, గూండాయిజానికి వ్యతిరేకంగా పోరాడుతున్న బిజెపి, మోదీలు యుపీ ఎన్నికల్లో పలు రౌడీలకు సీట్లిచ్చారు. దాదాపు 33శాతం రిజర్వేషన్లను రౌడీలకు కల్పించారనే సెటైర్లు వినిపిస్తున్నాయి. కాబట్టి ఒంటెద్దు పోకడలు పోకుండా మోదీ సరైన నిర్ణయాలు తీసుకోవాల్సివుంది....!