బాలీవుడ్ క్రియేటర్ సంజయ్‌లీలా భన్సాలీ తీస్తున్న రాణిపద్మావతి జీవిత చరిత్రలో రాణిపద్మావతిని తప్పుగా చూపిస్తున్నారని గత కొంతకాలంగా రాజ్‌పుత్ వంశానికి చెందినవారు, కర్ణిసేన ఆందోళనకారులు ఆందోళన చేస్తున్నారు. జైపూర్‌లో చిత్రం షూటింగ్ జరుగుతుండగా, ఆందోళనకారులు షూటింగ్‌పై దాడి చేసి భన్సాలీని తీవ్రంగా కొట్టడమే కాకుండా, సెట్స్‌ని దహనం చేసి, తుపాకులతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత కూడా ఈ చిత్రం షూటింగ్ కోల్హాపూర్‌లో జరుగుతుండగా వీరు మరోసారి దాడి చేశారు. ఇక తాజాగా ముంబైలో భారీ నిరసన నిర్వహించి, భన్సాలీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
ఇంతకీ కర్ణిసేన ఆరోపిస్తోంది ఏమిటంటే... రాణి పద్మావతి ఎంతో ఆత్మాభిమానం కలిగిన రాణి అని, చిట్టోర్‌గడ్ కోటపై అల్లావుద్దీన్‌ఖిల్జీ దండయాత్ర చేసినప్పుడు ఆయనకు లొంగకుండా రాణిపద్మావతి ఆత్మత్యాగం చేసుకుందని చరిత్ర చెబుతోందని, కానీ ఈ చిత్రంలో రాణి పద్మావతిగా నటిస్తున్న దీపికాపడుకొనేకు అల్లావుద్దీన్‌ఖిల్జీగా నటిస్తున్న రణవీర్‌సింగ్‌కు మద్య ప్రేమాయణం సాగినట్లు చూపిస్తున్నారని కర్ణిసేన ఆరోపిస్తోంది. మొదట్లో అలాంటిదేమీ లేదని చెప్పిన భన్సాలీ ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేసి, అనుమానాలకు తెరదించకుండా షూటింగ్‌ను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. నిజంగా ఆయన చరిత్రను తప్పుగా చూపించకుండా ఉండాలనుకుంటే దీనిపై సవివరమైన ప్రకటన, హామీ ఇవ్వాలి.
కానీ భన్సాలీ ప్రజాస్వామ్యం, వాక్‌స్వాతంత్య్రం అనే వాటి ముసుగులో చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నాడని అధికశాతం మంది భావిస్తున్నారు. అలా చిత్రీకరించడం భవిష్యత్తు తరాలకు మంచిది కాదని, కేవలం తన వ్యాపారం కోసం, సెన్సేషన్ క్రియేట్ చేసి తన చిత్రానికి హైప్ తేవడం కోసం మాత్రం భన్సాలీ అలా మౌనంగా ఉన్నాడా? అనే సందేహాలు వస్తున్నాయి. ఆయనపై దాడిని అందరూ ఖండించారు. భౌతికదాడులకు దిగడం సరికాదని తేల్చారు. కానీ భన్సాలీ వైఖరి చూస్తుంటే మాత్రం ఇప్పుడు అందరికీ అదే అనుమానాలు వస్తున్నాయి. గతంలో 'జోధా అక్బర్' వంటి చిత్రాలలో కూడా భన్సాలీ చరిత్రను తప్పుదోవ పట్టించాడనే వాదనలున్నాయి. మరి ఈ విషయంలో తప్పు ఎవరిది? అని తేల్చాసింది ప్రజలే.