ఎప్పుడు క్రియేటివిటీ గురించి ఎక్కువగా మాట్లాడే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఓ వ్యక్తి షాకిచ్చాడు. వర్మ తాజాగా అమితాబ్‌తో తీస్తున్న 'సర్కార్ 3' కథ, స్క్రీన్‌ప్లే తనవేనని, వర్మ తనకు టైటిల్ కార్డ్స్‌లో పేరు వేస్తానని చెప్పి వేయలేదని, అలాగే తనకు ఇస్తానన్న పారితోషికాన్ని కూడా ఇవ్వలేదని ముంబైహైకోర్టులో కేసు వేశాడు. దీంతో న్యాయస్ధానం ఆయన బాధను అర్ధం చేసుకుని, చిత్రాన్ని విడుదలకు ముందే ఆ కేసు వేసిన నీలేష్‌కు చిత్రాన్ని ప్రదర్శించాలని, అలాగే 6.2 లక్షలను కోర్టులో ముందుగా డిపాజిట్ చేయాలని ఆదేశించింది.
దీంతో వర్మ ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఈ చిత్రాన్ని వర్మ తన బర్త్‌డే కానుకగా ఏప్రిల్7న విడుదల చేయాలని భావిస్తున్నాడు. ఇక ఈ వివాదం నుంచి వర్మ ఎలా బయటపడతాడో? వేచిచూడాల్సివుంది. మరోవైపు ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా అమితాబ్ సుభాష్‌ఘయ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా అమితాబ్‌కు వర్మ స్థిరత్వం లేని దర్శకుడు కదా...! ఆయనతో మరలా ఎందుకు నటిస్తున్నారు? అనే ప్రశ్న ఎదురైంది. దానికి బిగ్‌బి సమాధానం ఇస్తూ.. నిజమే.. స్దిరత్వం లేకపోవడమనేది విచిత్రమే. కానీ ఎప్పుడు ఒకే బ్యాక్‌డ్రాప్, ఒకే విధమైన చిత్రాలు ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి.
ఎప్పుడు నలుపు రంగు దుస్తులే వేసుకుంటే ఇతర రంగుల్లోని గొప్పతనం తెలియదు. ఒకే రంగు దుస్తులు ధరిస్తూ ఉంటే ఎవరికైనా కొద్దికాలానికి బోర్ కొడుతుంది. వర్మ ఎప్పుడు కొత్తదనంకోసం నిరంతరం అన్వేషణ చేసే క్రియేటర్. వర్మది విరామం లేకుండా సృజనాత్మకంగా ఉండాలని ఆలోచించే తత్వం. ఎప్పుడు తన ఆలోచనల నుంచి కొత్తదనం రావాలనుకునే వ్యక్తి అని వర్మకి కితాబు నిచ్చాడు. ఫ్లాప్‌లలో ఉన్నప్పటికీ, ఒకప్పుడు ఇక తనతో చిత్రాలు చేయనని చెప్పిన బిగ్ బి వంటి వ్యక్తి తన గురించి, తన సృజనాత్మకత గురించి, దర్శకునిగా ఆయన తనను నమ్మిన విధానం చూసి వర్మ ఒక్కసారి ఏడ్చేశాడని, అమితాబ్ నమ్మకాన్ని వమ్ము చేయనని హామీ ఇచ్చాడట.