పవన్ సామాన్యంగా ఎవ్వరి ముందు ఓపెన్‌కాడు. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఆయన మాటల్లో ధైర్యం, కోపం, ఆవేశం, ఆలోచన వంటివే కనిపిస్తాయి. ఆయన అంత:ముఖుడు. ఇన్నర్ పర్సనాలిటీ, ఒక్క పట్టాన ఎవ్వరికీ అర్థంకాడు. తనను అందరూ అర్ధం చేసుకోవాలని కూడా ప్రయత్నించడు. తనకు నచ్చిన పనిని చేసుకుంటూ వెళ్తాడు. తన వివాహాల నుంచి తన అన్నయ్యతో విభేదాల దాకా ఆయన పెద్దగా విమర్శలను పట్టించుకునే రకం కాదు. సంజాయిషీ ఇచ్చుకునే నైజం కాదు. కానీ నిన్నటివరకు ఆయన కేవలం ఓ హీరో. కానీ నేడు ఆయన ప్రజానాయకునిగా మారి, రాజకీయాలలోకి ఎంటర్‌అయ్యాడు. స్వయాన ఓ పార్టీకి అధ్యక్షుడు. దీంతో ఆయన ఇప్పుడు తనపై ఉన్న అపోహలు, తన మనస్తత్వం, తన ఆలోచనా విధానం వంటి వాటిపై అందరికీ స్పష్టత ఇవ్వాలని భావించాడు. 'కాటమరాయుడు' వేడుకలో ఆయన చేసిన 20 నిమిషాల ప్రసంగం దీనికి అద్దం పడుతోంది.
ఇక రాజకీయ నాయకుడన్న తర్వాత విమర్శలు వస్తూనే ఉంటాయి. అంతా నా ఇష్టం అంటే వీలుకాదు. నా వ్యక్తిగతం గురించి మీకు అనవసరం అనడానికి లేదు. విమర్శలను తట్టుకోలేక పోవడాన్ని మానుకొని, నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్లాలి. అందుకే పవన్ ఈ ప్రసంగంలో ఇంతకాలం ఆయన చేసినవి కమర్షియల్ చిత్రాలే అయినా సరే...గోకులంలో సీత నుంచి నేటివరకు తాను నటించిన ప్రతి చిత్రాన్ని తానెందుకు అంతగా ప్రేమించాడో? వాటి కథల్లోని మర్మమేంటి? ఆయా చిత్రాలు, పాత్రలు తన జీవితంపై చూపిన ప్రభావం గురించి మాట్లాడాడు. మొదటి చిత్రం నుంచి గోకులంలో సీత, సుస్వాగతం, తమ్ముడు, ఖుషీ, బద్రి, తొలిప్రేమ వంటి ప్రతి చిత్రాన్ని హృద్యంగా ఆవిష్కరించాడు. ఆయన అంత: రంగం గురించి అర్ధం కాని వారికి వివరించే ప్రయత్నం మొదటి సారిగా చేశాడు.
ఇక ఆయన 'ఇజం' వంటి పుస్తకాలు వర్మ వంటి మేథావికి కూడా అర్ధంకాలేదు. కానీ ఈ ప్రసంగం ఆయన ఆలోచనా విధానం అర్ధం చేసుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు ఆయన అమెరికాలో హార్వర్డ్ యూనివర్శిటీలో చేసిన ప్రసంగం నుంచి ఆయన మాటల్లో మార్పు వస్తోంది. ఇక 'కాటమరాయుడు' చిత్రం వేడుకలో ఆయన చేసిన ప్రసంగంలో అతిశయోక్తులు గానీ, పంచ్‌డైలాగులు కానీ, నాటకీయత కానీ లేదు. పచ్చి వాస్తవాలను ఆయన అందరి కళ్ల ముందుంచాడు. ఇక తన అన్నయ్యపై కూడా తన ప్రేమను, అభిమానాన్ని ఆయన కొద్దిమాటతోనే వివరించాడు. మొత్తానికి ఈ ప్రసంగం ఆయనలోని సంఘర్షణను, ఆయన రాజకీయాలలోకి రావడానికి కారణాన్ని ఆయన అన్యాపదేశంగా తెలియజేసినట్లుగా భావించాలి.