సినిమాలలో ఉండి.. రాజకీయంగా ప్రవేశించే పెద్ద పెద్ద స్టార్స్ ఎక్కువమందికి రాయలసీమలోని జిల్లాలపైనే గురి ఎక్కువగా ఉంటోంది. కోస్తాకు చెందిన వారు సైతం రాయలసీమపైనే గురిపెడుతున్నారు. తమకు ఎలాగూ కోస్తాలో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి.. అలాగే కోస్తా వారమనే తప్పుడు అభిప్రాయాన్ని తొలగించుకోవాలని వారు రాయలసీమ జిల్లాలను టార్గెట్ చేస్తున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ నుండి హరికృష్ణ , బాలకృష్ణ, చిరంజీవి ఇదే పద్దతి ఫాలో అయ్యారు. కుల సమీకరణల రీత్యా, ప్రాంతీయ వాదం దృష్ట్యా వారు అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణలు అనంతపురం జిల్లాలోని హిందూపురంను టార్గెట్ చేశారు. చిరంజీవి కూడా రాయలసీమలోని తిరుపతిని ఎంచుకున్నాడు. ఇక చిరు కోస్తాలోని పాలకొల్లు నుండి పోటీ చేసినప్పటికీ అక్కడ హోరంగా ఓడిపోయి.. తిరుపతిలో సామాజిక వర్గ నేపథ్యంలో ఘనవిజయం సాదించాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
కాగా తాజాగా జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్ సైతం ఓటరుగా తన ఓటును కోస్తా జిల్లాలో నమోదుచేసుకున్నాడు. దాంతో ఆయన తన సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఏలూరు, లేదా తాడేపల్లిగూడెం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తాడని, చాలా మంది భావించారు. కానీ కులరహిత సమాజ స్థాపనే తన ధ్యేయంగా చెబుతున్న పవన్ మాత్రం అనంతపురం జిల్లానే ఎంచుకున్నాడు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలలో అనంతపురం మొదటిస్థానంలో ఉంటుంది. ఎప్పుడో పవన్ తనకు అనంతపురం జిల్లాను దత్తత తీసుకొవాలని ఉందని చెప్పి ఆ జిల్లా నుంచే పోటీ చేస్తానని ప్రకటించాడు. ఇక కోస్తాలో మరీ ముఖ్యంగా కృష్ణ నుంచి శ్రీకాకుళం వరకు పవన్ హవా ఉండవచ్చని చాలా మంది భావిస్తున్నారు. దీనికి తోడు రాయలసీమకు చెందిన చంద్రబాబు, జగన్‌లను నిలువరించాలంటే పవన్ అనంతపురంను టార్గెట్ చేయడం వెనుక కూడా చాలా లోతైన ఆలోచన ఉందంటున్నారు. మరి పవన్ కూడా రాయలసీమ వైపు దృష్టి పెడితే అది టిడిపికి, వైసీపికి పెద్ద తలనొప్పిగా పరిణమిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.