వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలల్లో కూడా నిలబడుతుందని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ విషయంపై ఆసక్తికర వాదనలు చోటు చేసుకుంటున్నాయి. జనసేన పోటీ చేయడం వల్ల ఏ పార్టీకి లాభం? ఏ పార్టీకి నష్టం? అనే విషయంపై పలు వాదనలు వినిపిస్తున్నాయి. ఇక జనసేనాధిపతి మరో అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో సీట్లను 60శాతం యువతకే ఇస్తానని ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలతోనే టిడిపి, వైసీపీలలో గుబులు మొదలైందనేది వాస్తవం. వచ్చే ఎన్నికల నాటికి లోకేష్‌ను తెరపైకి తెచ్చి, యువతకు పెద్దపీట అనే అంశాన్ని చంద్రబాబు నాయుడు వాడుకోవాలని భావించాడు. ఇక అఖిలేష్, ములాయంల మార్గంలో నడవాలని చూశాడు. ఈ రెండు పార్టీల గుర్తు సైకిలే కావడం యాధృచ్చికం. కానీ కిందటి ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీలో చెలరేగిన కుటుంబ విభేదాలు, ఆ పార్టీ ఘోర ఓటమి చంద్రబాబును భయపెడుతున్నాయి. టిడిపిని లోకేష్ చేతిలో పెడితే నందమూరి వారి నుంచి కలహాలు చెలరేగుతాయా? అని అంత:మధనం చెందుతున్నాడు.
ఇక మరో వైపు వైసీపీ అధినేత జగన్ సైతం తాను యువకుడినే కాబట్టి యువత కార్డుతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి, గెలవాలని స్కెచ్ వేశాడు. కానీ చంద్రబాబు, లోకేష్, జగన్‌ల వ్యూహాలను ముందుగానే పసిగట్టిన పవన్.. యువత నినాదాన్ని తీసుకున్నాడు. దీంతో టిడిపి, వైసీపీ శ్రేణులు బిత్తరపోయాయి. ఇక మరోవైపు ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి ముఖ్యమంత్రి కాలేకపోయి ఉండవచ్చు. ఎక్కువ సీట్లను గెలవలేకపోయి ఉండవచ్చు. కానీ ఓట్ల శాతం మాత్రం ఆయన గణనీయంగా సాధించాడు. కాపుల ఓట్లను, నాటి అధికార కాంగ్రెస్ నేత స్వర్గీయ వైస్‌రాజశేఖర్‌రెడ్డిపై ఉన్న ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రెండోసారి సీఎంగా ఎన్నికవ్వడానికి , చంద్రబాబును దెబ్బతీయడానికి పిఆర్‌పీ కారణభూతమైందనేది వాస్తవం.
ఇలా రేపు టిడిపి వ్యతిరేక ఓట్లను జనసేన చీల్చి, మరీముఖ్యంగా కోస్తాలోని జిల్లాలలో గణనీయమైన ఓట్లు సాధించిన పక్షంలో అది టిడిపికి ప్లస్ అవుతుందని, వైసీపీకి మైనస్ అవుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీ బలంగా ఉన్న నెల్లూరు, ప్రకాశంతో పాటు రాయలసీమ జిల్లాలలో జనసేన పోటీ చేయడం, అందునా అనంతపురం నుంచి పవన్ నిలబడిన పక్షంలో అది వైసీపీకే కాదు.. టిడిపికి కూడాపెద్ద దెబ్బలా పరిణమిస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జనసేన పార్టీకి టిడిపి కంటే తక్కువ, వైసీపీ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని పవన్ నిర్వహించిన సర్వే ద్వారా తేలినట్లు సమాచారం. దీంతో పవన్ ముఖ్యమంత్రి అయినా, కాకపోయినా...రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అనే విషయంలో మాత్రం ఆయన తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.