కమల్‌హాసన్.. ఈ పేరు వింటే ఎన్నో భిన్నవిభిన్న పాత్రలు, ప్రయోగాలు గుర్తుకువస్తాయి. అందులో 'విచిత్ర సోదరులు' చిత్రం ఒకటి, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో కమల్ సర్కస్‌లో పనిచేసే ఓ మరగుజ్జు పాత్రకు ప్రాణం పోశాడు. ఈ చిత్రం రెండు దశాబ్దాల కిందటే సంచలనం సృష్టించింది. ఇక ఇటీవల బాలీవుడ్‌లో అమీర్, షారుఖ్ వంటి స్టార్స్ కూడా కమల్‌ను ఆదర్శంగా తీసుకుని, ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేసి విజయం సాధిస్తున్నారు. ఆ తరహా చిత్రాలకు అక్కడ మంచి ఆదరణ లభిస్తోంది.
దీంతో దాదాపు ఇరవైఏళ్ల కిందటే కమల్ చేసిన మరగుజ్జు ప్రయోగాన్ని త్వరలో బాలీవుడ్ బాద్‌షా, కింగ్‌ఖాన్ షారుఖ్‌ఖాన్ చేయనున్నాడు. ఈ చిత్రం మరుగుజ్జుల పాత్రలతో అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా రూపొందనుంది. దీనికి ఆనంద్ ఎల్‌రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈరోస్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు 150కోట్ల బడ్జెట్‌తో షారుఖ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక ఈ చిత్రంలో షారుఖ్‌కు జోడీగా దీపికాపడుకొనే నటిస్తోంది. గ్రాఫిక్స్, విఎఫ్‌ఎక్స్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రం తీయనున్నారు. ఈ సాంకేతికకు కావాల్సిన సహాయాన్ని షారుక్ సొంత సంస్థ రెడ్ చిల్లీస్ అందించనుంది.
ఇక ఈ చిత్రంలో షారుఖ్ తరహా రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు, డ్యాన్స్‌లు కూడ ఉంటాయని దర్శకుడు స్పష్టం చేశాడు. షారుఖ్‌తో సినిమా అంటే రొమాంటిక్, డ్యాన్స్, సాంగ్స్ వంటివి లేకపోతే ఎలా? అని దర్శకుడు ఆనంద్ ఎల్‌రాయ్ సెలవిస్తున్నాడు. పెద్దగా సాంకేతికత లేని సమయంలో కమల్ మరగుజ్జుగా ఎంతో కష్టపడి ఆ పాత్రను ఔరా అనిపించాడు. మరి ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఆ పాత్రకు షారుఖ్ ఎంతటి న్యాయం చేస్తాడో చూడాలి. ప్రస్తుతం షారుఖ్ ఇంతియాజ్‌అలీ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ లవ్‌స్టోరీలో నటిస్తున్నాడు.