అక్కినేని వారసుల్లో చిన్నోడైన అఖిల్ అక్కినేని మొదటి చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో అందరికీ తెలిసిందే. దాంతో ఆయన తన రెండో చిత్రానికి చాలా టైమ్ తీసుకున్నాడు. ఈమధ్యకాలంలో ఆయనకు తన ప్రియురాలు శ్రేయాభూపాల్‌తో నిశ్చితార్ధం కూడా జరిగింది. కానీ అనుకోని కారణాల వల్ల ఇది బ్రేకప్ అయింది. దీంతో ఈ సిసింద్రీకి సరిగా మీసాలు రాని సమయంలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి.
అటు కెరీర్ పరంగా, ఇటు ప్యామిలీ పరంగా కూడా ఇబ్బందులు పడుతున్నాడు. ఇక అఖిల్ హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాగార్జున నిర్మాతగా అన్నపూర్ణ బేనర్‌లో రూపొందే అఖిల్ రెండో చిత్రం స్టోరీ, స్క్రిప్ట్ అన్నీ ఫైనలైపోయాయి. ప్రస్తుతం లోకేషన్ల వేటలో ఉన్నారు. ఈ చిత్రానికి 'జున్ను' అనే టైటిల్‌ను పెట్టే అవకాశాలున్నాయంటున్నారు. అంటే మొదటి చిత్రం 'అఖిల్'లో తన సొంత పేరును టైటిల్‌గా చేసుకుని దెబ్బతిన్న అఖిల్ తన రెండో చిత్రంలో నిక్‌నేమ్‌తో కనిపించనున్నాడన్న మాట.
ఈ చిత్రంలో అఖిల్ క్యారెక్టర్ ముద్దు పేరు జున్ను అని సమాచారం. మరి ఈ చిత్రంలో మేఘాఆకాష్ హీరోయిన్‌గా ఉంటుందా? లేక మరొకరు తెరపైకి వస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఇక వాస్తవానికి ఏయన్నార్ తనయునిగా నాగ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సమయంలో గానీ, నాగ్ పెద్ద కుమారుడు నాగచైతన్య తెరంగేట్రం చేసే ముందుగానీ రాని.. హైప్ అక్కినేని అఖిల్‌కి వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ కాలేక పోయిన అఖిల్..ఈ 'జున్ను' మరోసారి సిసింద్రీలా ఆకట్టుకుంటాడని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.