'బాహుబలి- ది బిగినింగ్' చిత్రం దేశ విదేశాలలో సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం ఓవరాల్‌గా 600కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఈ చిత్రం పార్ట్2 హిందీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమ చిత్రానికి ఎంత బడ్జెట్ ఖర్చయింది? ఎంత వసూలు చేసింది? అనే గుట్టును నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ తెలిపారు.
ఇప్పటివరకు 'బాహుబలి-ది బిగినింగ్', 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రాలకు గాను 450 కోట్ల బడ్జెట్ పెట్టినట్లు ఆయన తెలిపారు. ఇక ఈ చిత్రం మొదటి భాగం 600కోట్లు వసూలు చేసినా నిర్మాతలమైన తమకు ఏమీ మిగలేదని చెప్పి ఆయన షాక్ ఇచ్చారు. తమకు ఏమైనా లాభాలు వస్తే అది రెండో భాగం మీదనే అని ఆయన చెప్పారు. మరి 'బాహుబలి' మొదటి భాగం ద్వారా బాగా లాభపడింది ఎవరు? అనే విషయంలో ట్రేడ్‌ఎనలిస్ట్‌లు ఒక ఆసక్తికర అంశం చెబుతున్నారు.
'బాహుబలి-ది బిగ్‌నింగ్' వల్ల ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు బాగా లాభపడ్డారని విశ్లేషిస్తున్నారు. ఎక్కువ రేట్లకు మొదటి భాగాన్ని అమ్మకపోవడం వల్ల కొన్నవారికి, ప్రదర్శనదారులకు లాభాలు వచ్చాయని, కానీ మొదటి పార్ట్ సాధించిన సంచలన విజయంతో ఇప్పుడు రెండో పార్ట్‌ను మాత్రం తాము చెప్పిన రేటుకే కొనాలని దర్శకనిర్మాతలు డిమాండ్ చేసి అనుకున్నది సాధిస్తున్నారని వారు చెబుతున్నారు.