విమర్శలకు, సెటైర్లకు ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని కొంతవరకు కొన్ని సందర్భాలలో మాత్రమే వాడితే అందరూ ఆనంద పడతారు. కానీ ప్రతిదీ వంకర మాటలు, చేష్టలంటే వినేవారికి, చూసేవారికి కూడా మొహం మొత్తుతుంది. ఉదాహరణకు శ్రీనువైట్ల 'ఢీ' అనే చిత్రంతో బకరా కామెడీకి తెరతీశాడు. ఆతర్వాత అదే ఫార్ములాను అందరూ కాపీ కొట్టారు. చివరకు శ్రీనువైట్ల సైతం అలాంటి చిత్రాలు చేస్తూ పోయేసరికి ప్రేక్షకులు మొహం మొత్తి, ప్రస్తుతం ఆ తరహా ఫార్ములాలను తిప్పికొడుతున్నారు. ఇక విషయానికి వస్తే తిరిగే కాలు,.. ఆడే నోరు ఊరుకోవని.. ఇలాంటి సామెతలు మన పెద్దలు చెప్పిఉన్నారు. ప్రస్తుతం వర్మ పరిస్థితి కూడా అలాగే ఉంది. తనను నాగబాబు 'అక్కుపక్షి' అని తిట్టినప్పుడో, పవన్ 'వర్మవంటి పోర్న్‌సినిమాలు కలెక్ట్ చేసుకునే వాడి గురించి మాట్లాడటం అనవరం.. ' అన్నప్పుడో, లేదా చిరు ఖైదీ, బాలయ్య గౌతమీపుత్ర ఒకేసారి విడుదలైనప్పుడు.. ఇలాంటి సందర్భాలలో వర్మ ఘాటుగా స్పందించాడు. వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. అంతవరకు బాగానే ఉంది.
కానీ సమయం, సందర్భం లేకుండా అదే పనిగా మాట్లాడుతుంటే ఆ మాటలకు విలువేపోతుంది. తాజాగా విడుదలైన 'బాహుబలి- దికన్‌క్లూజన్' ట్రైలర్ దేశవిదేశాలలో సంచలనాలను సృష్టిస్తోంది. ఇది నిజం. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లతో పాటు ఎందరో దీనిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రామ్ అయితే మరో అడుగు ముందుకేసి, ప్రైడ్ ఆఫ్ తెలుగు, సారీ.. ప్రైడ్ ఆఫ్ సౌతిండియా, సారీ.. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటూ ట్వీట్ చేశాడు. కానీ ఈ చిత్రం ట్రైలర్ గురించి ఇప్పటివరకు మెగాఫ్యామిలీ హీరోలు స్పందించలేదు. మరోవైపు పవన్ 'కాటమరాయుడు'రిలీజ్ హడావుడిలో ఉన్నాడు. అంతమాత్రాన వర్మ ఏకంగా మెగాఫ్యామిలీని ఇన్‌డైరెక్ట్‌గా టార్గెట్‌చేస్తూ..ప్రపంచమంతా బాహుబలిని మెచ్చుకుంటూ ఉంటే. .. కొందరు టాలీవుడ్ ప్రముఖులు మౌనంగా ఉన్నారని, బహుశా కుళ్లు కుంటున్నారని కుళ్లు జోక్ వేశాడు. వాస్తవానికి బాహుబలి ట్రైలర్ చూసిన ఉదయాన్నే మాత్రం ఆయన ఈ ట్రైలర్ 'అమ్మమ్మలా..' ఉందంటూ ద్వందార్దంతో ట్వీట్ చేశాడు. ఒక లిమిట్ వరకు ఫర్వాలేదు కానీ శృతిమించితే ఏదైనా బోర్ కొడుతుంది. వర్మలాగా టాలీవుడ్‌లో అందరూ సోంబేర్లుగా ఖాళీగా కూర్చొలేదని కొందరు, నిజమే.. నీలాంటోళ్లు టాలీవుడ్‌లో కూడా ఎక్కువైపోయారు... అంటూ ఆయనకు కౌంటర్లు పడుతూనే ఉన్నాయి.