ప్రస్తుతం పళనిస్వామి సీఎంగా మారిన తర్వాత త్వరలో స్వర్గీయ జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసలు తమిళనాడు ప్రజల నాడి అనేది ఎలా ఉందో చూడాలంటే ఈ ఎన్నికల మీదనే ఆధారపడి ఉంది. దీంతో యావత్ దేశవ్యాప్తంగా ఈ ఉప ఎన్నిక ఆసక్తిని కలిగిస్తోంది. శశికళ వర్గం నుంచి దినకరన్ పోటీ చేయనున్నాడు. మరోపక్క ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేస్తానని జయ మేనకోడలు దీపా కొత్తపార్టీని స్థాపించి మరీ బరిలోకి దిగుతోంది. ఇక పన్నీర్‌సెల్వం వర్గం ఈ ఎన్నికల్లో తమ సొంత అభ్యర్థిని నిలబెడుతుందా? లేక దీపాకు మద్దతు ఇస్తుందా? అనేది వేచిచూడాల్సివుంది. ప్రతిపక్ష డీఎంకె నుంచి కూడా బలమైన అభ్యర్థినే రంగంలోకి దించనున్నారు. ఇక ఈ స్థానంలో బిజెపి తన అభ్యర్థిగా కమల్ మాజీ సహచారిణి గౌతమిని నిలబెట్టాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక్కడ తమిళ ఓటర్లు పలు విషయాలను తేల్చనున్నారు.
జయ మరణం తర్వాత ఇక అన్నాడీఎంకేకు స్థానంలేదని చెప్పి, ప్రతిపక్షమైన డీఎంకేను, స్టాలిన్‌ను ఒప్పుకుంటారా? లేక జయ మరణానంతరం ఎక్కువ మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసిన చిన్నమ్మ నేతృత్వంలోని పళనిస్వామి నిలబెట్టే దినకరన్‌ను గెలిపిస్తారా? లేక తాను అమ్మకు నమ్మినబంటునని, ఆమె తర్వాత ఆ స్థానం, అమ్మ ఆశయాలను సాధించేది తామేనని చెప్పి, చివరకు బలం నిరూపించుకోలేకపోయిన పన్నీర్ సెల్వం అభ్యర్థిని ఎన్నుకుంటారా? పన్నీరు సెల్వం అభ్యర్థిని నిలబెట్టని పక్షంలో జయ వారసురాలినని చెప్పుకుంటున్న దీపాను గెలిపిస్తారా? ఇలా పలు సందేహాలకు తమిళనాడులోని ఆర్‌కే నగర్ నియోజకవర్గ ఓటర్లు సమాధానం ఇవ్వనున్నారు. ఇక జయ చనిపోయిన తర్వాత కూడా లోకనాయకుడు కమల్ తన 'విశ్వరూపం' చిత్రం వల్ల దాదాపు 50కోట్లు నష్టపోయానని, దానికి కొన్ని ముస్లిం సంస్థలు కారణం కాదని, ఆనాటి నాయకులే దానికి కారణమని మరోసారి జయలలితపై కోపం ప్రకటించాడు. ముస్లిం వర్గీయులు తాను అప్పుల్లో ఉంటే వారే ఆదుకున్నారని చెప్పుకొచ్చాడు. ఈ పరిణామాల నేపథ్యంలో కమల్ ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడం ఖాయమని తేలింది. మరి గౌతమి కూడా ఎన్నికల్లో పోటీ చేసిన పక్షంలో కమల్ ఎవరికి అనుకూలంగా? ఎవరికి ప్రతికూలంగా ప్రచారం చేస్తాడనే విషయం ఆసక్తిని కలిగిస్తోంది.